ఇక ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు.. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక మార్పు!

by Prasad Jukanti |   (  Updated:2026-07-21 10:11:18  IST  )

ఇంటర్నెట్, సిగ్నల్స్ లేకున్నా NFC టెక్నాలజీతో రూ. 2,000 వరకు ఆఫ్‌లైన్ UPI చెల్లింపులు చేసుకునే కొత్త సదుపాయాన్ని NPCI తీసుకురాబోతోంది.

ఇక ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు.. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక మార్పు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: డిజిటల్ చెల్లింపులలో భారత్‍ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా దేశంలో డిజిటల్ పేమెంట్స్ విషయంలో మరో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లోనూ సులభంగా యూపీఐ లావేదేవీలు జరిపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) శ్రీకారం చుట్టబోతోంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే యూజర్ ఫోన్, వ్యాపారి వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సేల్ (POS) టెర్మినల్ రెండూ ఆఫ్ లైన్ లో ఉన్నప్పటికీ రూ. 2 వేల వరకు చెల్లింపులు జరిగేలా చేయవచ్చు. ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగా లేని ప్రాంతాలు, భూగర్భ టన్నెళ్లు లేదా విమాన ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా ఇకపై ఎలాంటి అంతరాయం లేకుండా డిజిటల్ చెల్లింపులు (UPI) జరిగిపోనున్నాయి.

'ఎన్‌ఎఫ్‌సీ' (NFC) సాంకేతికతతో చెల్లింపులు:

నేషనల్ మీడియా కథనం ప్రకారం నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) సాంకేతికత ఆధారంగా ట్యాప్-టు-పే విధానంలో తీసుకురానున్నారు. బ్లూటూత్ కంటే వేగంగా, మరింత సురక్షితంగా పనిచేసే ఈ షార్ట్-రేంజ్ వైర్‌లెస్ టెక్నాలజీతో యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను పాయింట్-ఆఫ్-సేల్ (PoS) టెర్మినల్ లేదా మరొక పరికరానికి దగ్గరగా ఉంచి సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ప్రారంభంలో NFC ఆధారిత ప్రతి నెట్‌వర్క్-రహిత లావాదేవీకి గరిష్టంగా రూ. 2,000 వరకు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. వినియోగదారులు ముందుగా ఇంటర్నెట్ ఉన్న సమయంలో 'యూపీఐ లైట్' (UPI Lite) అనే డిజిటల్ వ్యాలెట్‌లో డబ్బులను లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్నెట్, నెట్‌వర్క్ లేని చోట లేదా యూపీఐ పిన్ (UPI PIN) నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఆ వ్యాలెట్ బ్యాలెన్స్ నుంచి చెల్లింపులు పూర్తి చేయవచ్చు.

పాత విధానాలకు.. కొత్త సాంకేతికతకు తేడా ఏమిటి?:

ప్రస్తుతం ఇంటర్నెట్ లేనప్పుడు చెల్లింపులు చేయడానికి *99# (USSD కోడ్), UPI 123Pay (వాయిస్ కాల్ ద్వారా) వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. పాత విధానాలైన *99#, UPI 123Pay లకు డేటా నెట్‌వర్క్ అక్కర్లేకపోయినా కనీసం సాధారణ GSM మొబైల్ సిగ్నల్స్ లేదా కాల్ సౌకర్యం ఉండటం తప్పనిసరి. కానీ రాబోయే ఎన్‌ఎఫ్‌సీ (NFC) ఆధారిత ఫీచర్‌కు ఎటువంటి మొబైల్ సిగ్నల్స్ లేదా నెట్‌వర్క్‌తో కూడా సంబంధం లేకుండా పేమెంట్స్ చేసుకోవచ్చని తెలుస్తోంది.

Next Story