బిగ్ న్యూస్: ఈడీ వర్సెస్ కవిత.. ఈ నెల 20న ఏం జరగబోతుంది..?

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: ఈడీ వర్సెస్ కవిత.. ఈ నెల 20న ఏం జరగబోతుంది..?
X

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ వర్సెస్ కవిత మధ్య లీగల్ బ్యాటిల్ స్టార్ట్ అయ్యింది. ఈ నెల 16న ఈడీ ఎదుట కవిత హాజరు కావాల్సి ఉండగా ‘సుప్రీం’లో పిటిషన్ పేరుతో అటెండ్ కాలేదు. విచారణ వాయిదా వేయాలంటూ ఆమె రిక్వెస్ట్ చేస్తే కుదరదంటూ ఈడీ మరో డేట్‌ ఫిక్స్ చేసింది. కోర్టు పిటిషన్‌ను కవిత ప్రస్తావిస్తే విచారణకు సహకరించడంలేదనే వాదనను ఈడీ స్పెషల్ కోర్టులో వినిపించింది. మహిళగా తనకు హక్కులు ఉంటాయని, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని కవిత తన వాదనను తెరపైకి తెస్తే మనీ లాండరింగ్ చట్టంలోని నిబంధనల మేరకే విచారణ సాగుతున్నదని ఈడీ వివరణ ఇస్తున్నది. ఈ నెల 20న కూడా ఎంక్వయిరీకి వెళ్లకుండా కవిత తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకునే దానిపై ఈడీ దృష్టి సారించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ వర్సెస్ కవిత తరహాలో మారిన ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ ఇంకా విచారణ స్టేజీకి చేరుకోనందున దాన్ని సబ్-జ్యుడిస్ మేటర్‌గా పరిగణించలేమని ఈడీ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నెల 20న హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజా నోటీసు ప్రకారం హాజరు కాకపోతే ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న కవిత శుక్రవారం మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని అనుకుంటున్నారు. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్‌ను తొందరగా విచారణకు తీసుకోవాలని రిక్వెస్ట్ చేయనున్నట్లు తెలిసింది.

తగిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న ఈడీ

లిక్కర్ కేసు దర్యాప్తును వీలైనంత తొందరగా ముగించి చార్జిషీట్లు దాఖలు చేయాలని భావిస్తున్న విషయాన్ని ఈడీ స్పెషల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. విచారణకు పిలిచినా కవిత హాజరు కావడంలేదనే అంశాన్ని కోర్టుకు వివరించింది. పదేపదే వాయిదాలు వేస్తున్నారని, ఇందుకు రకరకాల రీజన్స్ చూపుతున్నారని ప్రస్తావించింది. ముందుగా ఈ నెల 9న హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇస్తే జంతర్‌మంతర్ దీక్ష పేరుతో దాన్ని 11వ తేదీకి వాయిదా వేశారని తెలిపింది. అదే రోజున తదుపరి విచారణ 16వ తేదీన ఉంటుందని నోటీసులో పేర్కొన్నా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి రిలీఫ్ పొందే ప్రయత్నం చేశారని గుర్తు చేసింది. 16న విచారణకు హాజరు కాకుండా మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారని, చివరకు గైర్హాజరయ్యారని పేర్కొన్నది.

కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతున్నదని..

బాధ్యత కలిగిన పౌరురాలిగా విచారణకు సహకరిస్తానంటూ మెయిల్ ద్వారా చెబుతూనే వాయిదాలు కోరుతూ, సుప్రీంకోర్టు పిటిషన్‌ను ప్రస్తావిస్తూ, మహిళగా ఇంట్లోనే విచారించాలన్న వాదనను తెరపైకి తెస్తూ విచారణకు హాజరుకాకపోవడాన్ని ఈడీ సీరియస్‌గా తీసుకున్నది. ఎంక్వయిరీకి రాకపోవడంతో కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతున్నదని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇదే అంశాన్ని కోర్టు రికార్డుల్లోకి ఎక్కించడంలో ఈడీ సక్సెస్ అయింది. సుప్రీంకోర్టు పిటిషన్‌ను ప్రస్తావించి పరోక్షంగా అక్కడి నుంచి ఉత్తర్వులు వెలువడేంత వరకూ హాజరయ్యే ఉద్దేశం లేదని ఈడీ గ్రహించింది. అయినా ఈ నెల 20న హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. విచారణకు కవిత హాజరైతే ఎలా.. కాకపోతే ఏం చేయాలి.. అనే చర్చలు అటు ఈడీ వర్గాల్లో, ఇటు కవిత వైపున మొదలయ్యాయి.

కవితకు ఉన్న రిలీఫ్ ఆప్షన్లపై చర్చలు

ఈడీ దర్యాప్తు క్రమాన్ని గ్రహించిన కవిత రిలీఫ్ పొందేందుకు అన్ని కోణాల నుంచి లీగల్ నిపుణులతో సంప్రదింపులు మొదలు పెట్టారు. అందులో భాగంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ నెల 24లోపే విచారణకు తీసుకోవాల్సిందిగా స్పెషల్ రిక్వెస్టు చేయడం ఒక మార్గం. ఈడీ విచారణకు హాజరైనా అరెస్టు చేయకుండా ఉండేందుకు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ దాఖలు చేయడం మరో మార్గం. స్వయంగా ఆమె హాజరుకాకుండా న్యాయవాదిని పంపించడం ఇంకో మార్గం. ఇప్పటికే కవిత కోర్టును ఆశ్రయించి రిలీఫ్ పొందే ప్రయత్నం చేసినా ఆశించిన మేరకు ఫలితం రాలేదు. గురువారం తన తరఫున న్యాయవాదిని పంపించినా 20న విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసు అందుకోక తప్పలేదు. చివరి మార్గంగా అరెస్టు కాకుండా యాంటిసిపేటరీ పిటిషన్‌పైనే చర్చలు జరుగుతున్నాయి.

ప్రత్యామ్నాయ మార్గాలపై ఈడీ దృష్టి

ఈడీ సైతం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. తరచూ వాయిదాలు కోరుతూ విచారణకు సహకరించనందున మిగిలిన దర్యాప్తు ప్రక్రియకు ఆటంకం కలుగుతున్నదనే అంశాన్ని స్పెషల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ స్కామ్‌లో సౌత్ గ్రూపు తరపున పని చేసిన పిళ్లయ్‌ను కస్టడీలో భాగంగా ఆడిటర్ బుచ్చిబాబుతో కలిపి ఈడీ గురువారం విచారించింది. ఈ నెల 20వ తేదీ వరకూ పిళ్లయ్.. ఈడీ అదుపులోనే ఉండనున్నందున శుక్రవారం సైతం వీరిద్దరి జాయింట్ ఎంక్వయిరీ సాగనున్నది. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని సైతం శనివారం ఈడీ విచారించనున్నది. కవితకు జారీ చేసిన నోటీసు ప్రకారం 20న పిళ్లయ్, బుచ్చిబాబులతో కలిపి జాయింట్ విచారణ చేపట్టనున్నట్లు ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.

దర్యాప్తు ప్రక్రియ జరుగుతున్న తీరు, ఇకపైన జరిగే ప్రక్రియ గురించి కోర్టుకు వివరించిన ఈడీ తరఫు న్యాయవాది.. విచారణకు కవిత సహకరించడం లేదనే అంశాన్ని స్పష్టం చేశారు. విచారణకు సహకరించలేదనే రీజన్‌తోనే మనీశ్ సిసోడియాను ఈడీ గతంలో అరెస్టు చేసింది. ఇప్పుడు కవిత విషయంలోనూ అదే రిపీట్ అవుతుందనే పరోక్ష సంకేతాన్ని ఇచ్చినట్లయింది. ఈ క్రమంలో ఈ నెల 20న కవిత ఈడీ ఎదుట హాజరుకావడం కీలకంగా మారింది. ఈడీ వర్సెస్ కవిత తరహాలో జరుగుతున్న ఈ లీగల్ బ్యాటిల్ చివరకు ఎక్కడికి వెళ్తుంది..ఈ నెల 20 తర్వాత ఏం జరగబోతున్నది.. ఆ లోపు ఇంకెన్ని కొత్త రూపాలు ఉనికిలోకి వస్తాయి.. ఈ అంశాలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story

Most Viewed