జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి నిర్ణయం హైకమాండ్‌దే.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-29 05:02:29  IST  )

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అభ్యర్థి ఎంపిక విషయంలో తుది నిర్ణయం హైకమాండ్‌దేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థి నిర్ణయం హైకమాండ్‌దే.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అభ్యర్థి ఎంపిక విషయంలో తుది నిర్ణయం హైకమాండ్‌దేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవాళ ఆయన జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నేతలు అజారుద్దీన్, నవీన్ యాదవ్‌లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వారే అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎవరైనా అందరూ కలిసి పని చేస్తారని పేర్కొన్నారు. ఆశావహులు అన్ని డివిజన్లలో విస్తృతంగా తిరిగి పార్టీని బలోపేతం చేస్తారని అన్నారు. ఎట్టి పరిస్థితుత్లో బయటవారికి టికెట్ ఇవ్వబోమని.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తెలిపారు. అభ్యర్థుల ఎంపికపై సర్వే జరుగుతోందని ఎవరికి అవకాశాలు మెరుగ్గా ఉంటే వారికి టికెట్ దక్కుతుందని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని.. జూబ్లీ‌హిల్స్‌లోనూ తమదే విజయమని జోస్యం చెప్పారు. స్థానిక ప్రజలతో మమేకమై.. వారికి అందుబాటులో ఉన్న వారికే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఉప ఎన్నిక కోసం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశామని, పార్టీ నేతల సమన్వయం కోసం ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్లు, ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. జూబ్లీహిల్స్ నియెజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేవారు.

పదేళ్లలో గత సర్కార్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే..

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్.. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన పేరుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతున్నామని తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో రూ.6,800 కోట్లు ఖర్చు చేశామన్నారు. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నారని తెలిపారు. అన్నదాత అభ్యున్నతికి రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా వేగంగా రూపుదిద్దుకుంటున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం సిటీ అవతల కొల్లూరు‌లో డబుల్ ఇండ్లు కట్టారని.. అక్కడి ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. వారి ఉపాధి ఇక్కడైతే.. అక్కడ నివాసాలు ఉంటే ఎలా అని ప్రశ్నించారు. కానీ, తమ ప్రభుత్వం నిరుపేదల నివసించే చోటే ఇండ్లు కట్టేలా ప్లాన్ చేస్తోందని అన్నారు. స్థలాలు ఉన్న వారికి ఇల్లు మంజూరు చేయడంతో పాటు స్థలాలు లేని వారికి ఎలా ఇవ్వాలనే విషయంపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని.. ఇప్పటికే 50 వేల రేషన్ కార్డుల వెరిఫికేషన్ పూర్తి అయిందని అన్నారు. లక్షా 50 వేల మంది పేర్లు కొత్తగా రేషన్ కార్డుల్లో చేరాయని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని మంత్రి పొన్నం కామెంట్ చేశారు.

హైదరాబాద్ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాం..

హైదరాబాద్ నగరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఎస్టీపీలు, పార్క్‌లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్‌కు కృష్ణ, గోదావరి తప్ప అదనంగా ఒక్క చుక్క నీరు రాలేదని.. ప్రస్తుతం వస్తున్న నీరు కాంగ్రెస్ హయాంలో తెచ్చిందేనని అన్నారు. గోదావరి ఫేజ్-2 కింద 15 టీఎంసీ‌ల నీళ్లు తెచ్చే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నగరంలో వాటర్ హార్వెస్టింగ్ చేసి అండర్ గ్రౌండ్ వాటర్ పెంచడానికి అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా మారుస్తున్నాంమని.. రింగ్ రోడ్డు లోపల ఈవీ, సీఎన్జీ, LPG ఆటో‌లకు మాత్రమే అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీ బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు మారుస్తున్నామని మంత్రి పొన్నం అన్నారు.

Next Story