సన్నబియ్యం క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డిదే: మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

సన్నబియ్యం పథకం ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదేనని, ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

సన్నబియ్యం క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డిదే: మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అమలవుతున్న ప్రతిష్టాత్మక సన్నబియ్యం పథకంపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఈ అద్భుతమైన ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)దేనని, ఆ ఘనత పూర్తిగా ఆయనకే దక్కుతుందని కొనియాడారు. ప్రభుత్వానికి ఎంత ఆర్థిక భారమైనా సరే పేద ప్రజలు గౌరవంగా, కడుపునిండా భోజనం చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి స్పష్టం చేశారు. సన్నబియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం ఏటా రూ.14,560 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. గతంలో తమ అధినేత్రి సోనియా గాంధీ తీసుకొచ్చిన ఫుడ్ సెక్యూరిటీ బిల్లు ఆశయాలకు తెలంగాణలో పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతోందని ఉత్తమ్ అన్నారు.

86 శాతం మందికి లబ్ధి..

రాష్ట్రంలోని సుమారు 3 కోట్ల 39 లక్షల మంది సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని మంత్రి ఉత్తమ్ వివరించారు. అర్హులైన వారు ఎవరైనా సరే, రాజకీయాలకు అతీతంగా కొత్త రేషన్ కార్డులు (Ration Cards) మంజూరు చేస్తున్నామని తెలిపారు. అడిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇక తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లోకి రూ.40 వేల కోట్లు జమ చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు చేరుతున్నాయని, ఎక్కడా జాప్యం జరగకుండా పౌరసరఫరాల శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story