శాంతి చర్చలకు సిద్ధమే కానీ.. ముందు ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-10 11:56:08  IST  )

‘మేం శాంతి చర్చలకు వ్యతిరేకం కాదు. కానీ.. ముందుగా ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి.. సాయుధ బలగాల మోహరింపును ఆపాలి’ అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.

శాంతి చర్చలకు సిద్ధమే కానీ.. ముందు ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి
X
దిశ, వెబ్‌డెస్క్ : ‘మేం శాంతి చర్చలకు వ్యతిరేకం కాదు. కానీ.. ముందుగా ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలి.. సాయుధ బలగాల మోహరింపును ఆపాలి’ అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. ప్రజల ప్రయోజనాలకోసం ఎప్పుడైనా చర్చలకు సిద్ధంగా ఉంటామని చెప్పింది. ఈ మేరకు ఇవాళ ప్రజలకు, విప్లవకారులకు కేంద్ర కమిటీ పేర ఓ లేఖ విడుదల చేసింది. సీపీఐ (మావోయిస్టు) పార్టీ స్థాపనకు 21 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ నెల 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా వార్షికోత్సవాలను విప్లవ స్ఫూర్తితో నిర్వహించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. శత్రువు కొనసాగిస్తున్న ఆపరేషన్ ‘కగార్’ను తిప్పికొట్టి, పార్టీ, పీఎల్‌జీఏ (ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ), ప్రజాసంఘాలను కాపాడుకోవాలని పేర్కొంది.

మళ్లీ పురోగమిస్తాం..

1972లో చారూ మజుందార్ హత్య అనంతరం, ఎన్నో ఆపరేషన్లు ఎదురైనా ఉద్యమం తిరిగి బలపడిందని లేఖలో మావోయిస్టులు గుర్తుచేశారు. నేటి వెనకంజ పరిస్థితి తాత్కాలికమని, క్రమపద్ధతిలో గెరిల్లా యుద్ధాన్ని కొనసాగిస్తే విప్లవోద్యమం మళ్లీ పురోగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు @ బసవరాజు సహా పలువురు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయారు. 366 మంది మావోయిస్టు కార్యకర్తలు, గెరిల్లా యోధులు, ప్రజాసంఘాల సభ్యులు అమరులయ్యారని కేంద్ర కమిటీ తెలిపింది. అంతర్జాతీయ విప్లవోద్యమంలో కూడా అనేక మంది నేతలు మరణించారని, వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని పేర్కొంది.

ప్రజల దృష్టిని మళ్లించడానికే ‘పథకాలు’

‘వికసిత భారత్’ నినాదం ప్రజలను మోసం చేయడమే తప్ప, దేశాన్ని కార్పొరేట్ల ఆధిపత్యంలోకి నెట్టడానికి చేస్తున్న యత్నమని మావోయిస్టులు ఆరోపించారు. ‘ఆత్మనిర్భర్ భారత్, ‘వోకల్ ఫర్ లోకల్’ వంటి నినాదాలు ప్రజల దృష్టి మళ్లించడానికి మాత్రమేనని విమర్శించారు.

Next Story