- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సద్దుమణిగిన వివాదం..! ఎమ్మెల్సీ కవితతో ఆ ఇద్దరి సంప్రదింపులు సక్సెస్
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారంలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న కవిత వ్యవహరాన్ని మొగ్గ దశలోనే తుంచివేయాలని ఆయన నిర్ణయించారు. అసలే ప్రతిపక్షంలో ఉండి ఇబ్బందులు పడుతున్న వేళ మరోవైపు సొంత పార్టీలో కుటుంబ సభ్యురాలే పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తుండటంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగినట్లుగా తెలిసింది. చికాకులను వీలైనంత త్వరగా తొలగించుకోకుంటే పార్టీకి రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన గుర్తించినట్లు తెలిసింది. దీనిలో భాగంగా కవితతో రాజీకి సిద్ధమైనట్లుగా సమాచారం. ఆమెను బుజ్జగించడానికి, ఆమెతో రాజీ చర్చలు మొదలుపెట్టారు. కేసీఆర్ ఆదేశాలతో ఆయనకుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు డి.దామోదర్ రావు, సీనియర్న్యాయవాది గండ్ర మోహన్‌రావులను రంగంలోకి దింపారు.
కవిత ఇంటికి ఆ ఇద్దరు..
సోమవారం మధ్యాహ్నం వీరిరువురు కలిసి బంజారా హిల్స్‌లోని కవిత ఇంటికి వెళ్లారు. దాదాపుగా 3 గంటలకు పైగా కవితతో చర్చలు జరిపారు. కేసీఆర్ చెప్పమన్న విషయాలను ఆమెకు చేరవేశారు. ఇప్పటివరకు జరిగిన విషయాలను మర్చిపోవాలని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఈ సమయంలో అధినేత కేసీఆర్ కుటుంబంలోనే విభేదాలు అనే సంకేతాలను సమాజానికి, పార్టీ శ్రేణులకు వెళ్లడం ద్వారా పార్టీ కేడర్ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, ప్రజలకు పార్టీపై విశ్వాసం దెబ్బతినే అవకాశం ఉందని వారు కవితకు చెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఏమైనా ఇబ్బందులు ఉంటే కేసీఆర్‌కు చెప్పుకోవాలని సూచించినట్లుగా సమాచారం. పార్టీ ఎదగడంలో ఎంతో కష్టపడ్డారని, పార్టీలో మీ భాగస్వామ్యం కూడా ఉందని చెప్పినట్లుగా తెలిసింది.
రాబోయే రోజుల్లో తప్పకుండా పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటుందని వారు ఆమెకు చెప్పినట్లుగా పార్టీ నాయకుల ద్వారా తెలిసింది. ఈ సందర్భంగా కవిత కూడా తనకు పార్టీలో జరుగుతున్న అన్యాయాలు, తగ్గిన ప్రాధాన్యత, పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఉద్దేశపూర్వకంగా జరిగిన అవమానాలు, ఇతర అంశాలను ఆమె వారి దృష్టికి తీసుకవచ్చినట్లుగా తెలిసింది. తాను ఏ సందర్భంలో, ఎంత బాధతో లేఖ రాయాల్సి వచ్చిందో ఆ పరిణామా క్రమాలన్నింటినీ వారికి పూస గుచ్చినట్లుగా చెప్పినట్లు తెలిసింది. వీరి భేటి 3 గంటలకు పైగా కొనసాగింది. అనంతరం భేటీకి సంబంధించిన అంశాలను దామోదర్ రావు, మోహన్‌రావు.. కేసీఆర్‌కు స్వయంగా వివరించనున్నట్లుగా సమాచారం. ఆ తర్వాత కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా వారు వ్యవహరించనున్నారు. కవితతో మరోసారి సైతం చర్చలు జరిగే అవకాశం ఉందని, అనంతరం కేసీఆర్‌తో కవిత భేటీ అవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
అన్నకు మద్దతుగా చెల్లెమ్మ ట్వీట్..
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ.. కేటీఆర్నోటీసులు ఇవ్వడాన్ని కవిత ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలియగానే ఆమె కేటీఆర్‌కు మద్దతుగా స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజాసమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిందని ఆమె తప్పుబట్టారు. దీంతో పార్టీ కేడర్, నాయకులు, రాజకీయవర్గాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఒక వైపు కుటుంబంలో ఆధిపత్య పోరు, అంతర్గత పోరు నడుస్తూ అదే చర్చనీయాంశంగా ఉండగా ఒక్కసారి గా కేటీఆర్‌ను సమర్ధిస్తూ కవిత పోస్టు చేయడం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. ఒకరకంగా కేటీఆర్, కవితకు మధ్యనే పోరు అనే స్థాయిలో సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంటే ఈ ట్వీట్ చూసి నెటిజన్లు సైతం షాక్ అయ్యారు.
కవిత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి?
మరోవైపు కవిత అమెరికా పర్యటన ముగించి మూడు రోజులు అవుతున్నది. శుక్రవారం రాత్రి ఆమె హైదరాబాద్‌చేరుకున్నారు. ఆమె ఎయిర్ పోర్టులో మాట్లాడిన మాటలు తప్ప ఇంతవరకూ మరల నోరు విప్పలేదు. అదే సమయంలో ఆమెపై ఎవరూ మాట్లాడకూడదంటూ కేసీఆర్ఆదేశాలు జారీ చేయడంతో పార్టీ కేడర్‌కూడా స్పందించలేదు. ఈ మూడు రోజులుగా ఆమె ఎవరితోనూ భేటీ అవ్వలేదు. మీడియాతోనూ మాట్లాడలేదు. కుటుంబ సభ్యులతో ఇంట్లోనే ఉండిపోయారు. అయితే, ఆమె మంగళవారం నుంచి కార్యకర్తలకు అందుబాటులోకి రానున్నారని తెలిసింది. నేటి నుంచి కార్యకర్తలు, అభిమానులతో వరుసగా భేటీలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇదే క్రమంలో కవిత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతున్నదన్న చర్చ సైతం జోరుగా సాగుతున్నది. నేటి నుంచి అందుబాటులోకి వస్తే.. ఆమె ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారన్న టాక్ నడుస్తున్నది. రాజీ చర్చలు జరుగుతున్నవేళ ఆమె దూకుడుగా వెళ్లే అవకాశం లేదని, చర్చలకు అవకాశం ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో చర్చలకు మంచి ఫలితం వస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.






