తెలంగాణలోనూ ఓట్ చోరీ.. అప్రమత్తమైన కాంగ్రెస్

by Vemula.Srinu Prasad |

ఎస్ఐఆర్‌ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకున్నది. ఎస్ఐఆర్‌పై ఆదివారం కాంగ్రెస్ నాయకులకు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ..

తెలంగాణలోనూ ఓట్ చోరీ.. అప్రమత్తమైన కాంగ్రెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఐఆర్‌ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకున్నది. ఎస్ఐఆర్‌పై ఆదివారం కాంగ్రెస్ నాయకులకు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక యూనిట్‌గా అరగంట చొప్పున 6 జూమ్ మీటింగ్‌లు జరిగాయి. ఈ జూమ్ మీటింగ్‌లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు ఇంచార్జ్‌లు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. జూమ్ సమావేశంలో అనేక అంశాలపైన నేతలు చర్చించారు. తెలంగాణలో కూడా ఓట్ చోరీ చేసే అవకాశం ఉందని, నియోజక వర్గాలలో నాయకులు చాలా అప్రమతంగా ఉండాలని వారు జాగ్రత్తలు తెలిపారు. ఓటర్ మ్యాపింగ్, సర్ జరిగే విధానం, బీఎల్ఏ చేయాల్సిన పనులు, బీఎల్ఓ చేస్తున్న పనులపై నిఘా వంటి అంశాలపైన చర్చించారు. ఓటర్ మ్యాపింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకులకు తగిన సూచనలు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంత శాతం ఓటర్ మ్యాపింగ్ జరిగింది, మిగతా ఓటర్ మ్యాపింగ్‌లో ఓట్ కోల్పోయిన వారిని గుర్తించి వారికి తిరిగి ఓట్ హక్కు కల్పించే అంశాలపై నేతలకు వివరించారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌లు మాట్లాడుతూ దేశంలో బీజేపీ, ఎన్నికల కమిషన్‌లు కలిసి ఓట్ చోరీకి పాల్పడుతున్నాయని, అప్రజాస్వామికంగా దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని వారు విమర్శించారు. సర్ పేరుతో ఓట్ల పరిశీలన చేపట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓట్లను చోరీ చేసి దొంగతనంగా రాజకీయాలు చేస్తున్నాయని వారు ఆరోపణలు గుప్పించారు. బీఎల్ఏలు ఓటటు మ్యాపింగ్ ను లోతుగా పరిశీలించి ప్రతి నిజమైన ఓటును కాపాడాలని టీపీసీసీ చీఫ్, పార్టీ ఇంచార్జిలు సూచించారు. ఓటు కనుక తొలగిస్తే వెంటనే తగిన ఆధారాలతో వాటిని తిరిగి దరఖాస్తు చేయించి పునరుద్ధరణ జరిగేలా చూడాలని వారు సూచించారు. రాబోయే ఎన్నికలలో చాలా కీలకంగా ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్క ఓటును కాపాడుకోవాలని మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్‌లు అన్నారు. ఈ జూమ్ మీటింగ్‌లకు కో ఆర్డినేటర్‌గా నాయకులు గంప వేణు గోపాల్ వ్యవహరించగా, ఎన్నికల కమిషన్ కు సంబంధించిన వివరాలను టీపీసీసీ ఎలెక్షన్ కమిషన్ చైర్మన్ రాజేష్ వివరించారు. కాగా, ఇప్పటి వరకు 90 శాతం బీఎల్ఏ ట్రైనింగ్ కార్యక్రమాలు పూర్తి కాగా, ఇక నుంచి బీఎల్ఏ2లు క్షేత్ర స్థాయిలో 25వ తేదీ నుండి ఇంటింటికి వెళ్లనున్నారు. ప్రతి 10 బూతులకు ఒక సూపర్ వేజర్ ని నియామకం చేస్తూ, ప్రతి అసెంబ్లీకి ఒక కోఆర్డినేటర్ ని నియమించి, ఏఈఆర్వో, ఈఆర్వోలతో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి పొన్నం ప్రభాకర్, ట్రైనింగ్ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పార్లమెంట్ల వారీగా డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటుట్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ నేతలతో మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్‌ల జూమ్ సమావేశం

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి సర్ ప్రక్రియను ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ లు మంత్రి పొన్నం ప్రభాకర్ కి సూచించారు. సర్‌పై అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే హుస్నాబాద్ నియోజకవర్గంలో సర్ ఓటరు సవరణ ప్రక్రియపై బీఎల్ఏ2 లకు శిక్షణ ఇచ్చామని మంత్రి తెలిపారు. బూత్ లెవెల్ ఏజెంట్‌లకు వారి బూత్‌లో అర్హత ఉన్న ఒక ఓటు కూడా పోకుండా జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సర్ ప్రక్రియపై పార్టీ నాయకులు, బీఎల్ఏ-2లు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని మంత్రికి సూచించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చిరునామా మార్పు, పేరు సవరణ, ఫోటో మార్పు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్‌లు సూచించారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పార్టీ నాయకులు సమన్వయంతో పని చేసి ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు.

Next Story