చెడ్డిగ్యాంగ్ కంటే కాంగ్రెస్ గ్యాంగ్ డేంజర్.. మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.

చెడ్డిగ్యాంగ్ కంటే కాంగ్రెస్ గ్యాంగ్ డేంజర్.. మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రైతు డిక్లరేషన్ (Farmers' Declaration) పేరిట కాంగ్రెస్ పార్టీ నయవంచనకు పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఇవాళ వరంగల్‌ (Warangal)లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రైతు సంగ్రామ సదస్సు'కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని కొనియాడారు. వరంగల్ నుంచి పోరాటాల విల్లు ఎక్కుపెడితే ద్రోహుల గుండెలు ఝల్లుమంటాయని వ్యాఖ్యానించారు. రైతులకు జరిగిన మోసాలను ఎండగట్టేందుకే ఈ సదస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కాంగ్రెస్ 34 రైతు హామీలు ఎక్కడ..

నాలుగేళ్ల క్రితం ఇదే వరంగల్‌ గడ్డపై కాంగ్రెస్ (Congress) పెద్దలు వచ్చి ‘రైతు డిక్లరేషన్’ ప్రకటించారని కేటీఆర్ గుర్తు చేశారు. 60 ఏళ్ల పాటు రైతుల రక్తం తాగిన కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల ముందు మాత్రం కొంగజపం చేసిందని ఎద్దేవా చేశారు. రైతు డిక్లరేషన్‌లో అన్నదాతలకు ఇచ్చిన 34 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓట్లు వేసిన రైతులు నేడు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి, నేడు నెలలు గడుస్తున్నా అతీగతీ లేదని ధ్వజమెత్తారు.

రైతు డిక్లరేషన్ ఓ బోగస్..

రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రమని, అది కేవలం చిత్తు కాగితమని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్నది ‘రైతు మేళా’ కాదు, అది ఒక ‘దగా మేళా’ అని సంబోధించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi), రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫోటోలను పోలీస్ స్టేషన్లలో అంటించి ‘దొంగలొస్తున్నారు జాగ్రత్త’ అని రాయాలన్నారు. చెడ్డీ గ్యాంగ్ కంటే కాంగ్రెస్ గ్యాంగ్ చాలా ప్రమాదకరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎకరాకు రూ. 10 వేలు ఇస్తే, తాము రూ. 15 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పటివరకు రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 69 సార్లు ఢిల్లీ వెళ్లారని, రాష్ట్ర రైతుల కోసం 69 పైసలైనా తెచ్చారా? అని ఆక్షేపించారు. వడ్ల కొనుగోళ్లలో జాప్యం జరిగితే రైతులు కాంగ్రెస్ నేతలను ఊరూరా తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.

Next Story