రాజేంద్రనగర్‌లోనే సర్కిల్ ఆఫీసు ఉండాలి

by Muthe.Rajitha |

రాజేంద్రనగర్ పేరు తో ఏర్పాటైన రాజేంద్రనగర్ సర్కిల్, రాజేంద్రనగర్ జోనల్ కార్యాలయాలు ఇక్కడే ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

రాజేంద్రనగర్‌లోనే సర్కిల్ ఆఫీసు ఉండాలి
X

దిశ, రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ పేరు తో ఏర్పాటైన రాజేంద్రనగర్ సర్కిల్, రాజేంద్రనగర్ జోనల్ కార్యాలయాలు ఇక్కడే ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గ్రేటర్ అధికారులు డివిజన్ల విభజన, డివిజన్ కార్యాలయాల ఏర్పాటు చేసిన నోటిఫికేషన్‌లో రాజేంద్రనగర్‌లోనే నూతనంగా ఏర్పాటు చేసిన రాజేంద్రనగర్ జోనల్ కార్యాలయం, రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఉంటుందని విడుదల ఉంది. అయితే సర్కిల్ అధికారులు మాత్రం కిస్మత్ పూర్ లో గతంలో నిర్మించిన కార్యాలయం విశాలంగా ఉందని, అక్కడే రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని శనివారం అక్కడే సమావేశాలు నిర్వహించారు. కిస్మాత్ పూర్ నుంచి కార్యకలాపాలు చేయకూడదని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు. రాజేంద్రనగర్ పేరుతో నియోజకవర్గం ఉందని, మండలం ఉందని, రాజేంద్రనగర్ సర్కిల్ కూడా ఉందని అంటున్నారు. రాజేంద్రనగర్ లో అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని ఇక్కడనే రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఉండాలని కోరుతున్నారు.

గతంలోనూ అన్యాయమే..

రాజేంద్రనగర్ పేరుతో గతంలో మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ను స్థానిక ప్రజా ప్రతినిధి పట్టుబట్టి శంషాబాద్ లో ఏర్పాటు చేసేలా చూశారు. నేడు శంషాబాద్‌లో ఉన్న డిగ్రీ కళాశాల‌లో విద్యార్థులు చేరకపోవడంతో అది ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతుంది. అలాగే రాజేంద్రనగర్ డివిజన్‌లో ఉన్న అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయంతో పాటు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కార్యాలయాన్ని మణికొండకు మార్చారు. రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గచ్చిబౌళి లో నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణం పూర్తయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా గచ్చిబౌళి కి వెళ్లిపోతుంది. ఇప్పుడు రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం కిస్మత్ పూర్ కు వెళితే రాజేంద్రనగర్ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది.

ఇక్కడే సర్కిల్ కార్యాలయం ఉండాలి

రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ప్రస్తుతం ఉన్న సర్కిల్ కార్యాలయంలోనే ఉండాలి. భారత మొదటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ పేరుతో ఏర్పాటు అయిన రాజేంద్రనగర్ లో ఉండాల్సిన కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించడం బాధాకరం. గతంలో డిగ్రీ కళాశాలను శంషాబాద్ కు తీసుకువెళ్లి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. ఇప్పుడు రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయాన్ని కూడా కిస్మత్పూర్ కు మార్చడం సరికాదు.

- అప్పారెడ్డిగూడెం మాధవి, రాజేంద్రనగర్ డివిజన్ వార్డు కమిటీ మాజీ సభ్యురాలు

సర్కిల్ కార్యాలయాన్ని మార్చడం అన్యాయం

రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయాన్ని కిస్మత్పూర్‌కు మార్చాలనుకోవడం అన్యాయం. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. రాజేంద్రనగర్ లోనే రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాయలం, జోనల్ కార్యాలయాలు ఉండాలి. లేనట్లయితే రాజేంద్రనగర్ ఉనికి ని కోల్పోయే ప్రమాదం ఉంది. దీనిపై రాజేంద్రనగర్ సర్కిల్ ప్రజలందరు ఉద్యమించాలి.ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అధికారులు ఆలోచించి రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం రాజేంద్రనగర్ లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలి.

- ఎం శ్రీనివాస్ యాదవ్, బవానీ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

Next Story