GHMCలో అవినీతికి ముఖ్యమంత్రే బాధ్యుడు.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత

by Kema Shiva Kumar |

జీహెచ్‌ఎంసీలో రూ.1,148 కోట్ల భారీ అవినీతి జరుగుతోందని, ఇందుకు ముఖ్యమంత్రే బాధ్యుడని కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు.

GHMCలో అవినీతికి ముఖ్యమంత్రే బాధ్యుడు.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ (GHMC), హెచ్ఎండీఏ (HMDA) పరిధిలో జరుగుతున్న భారీ అవినీతికి ముఖ్యమంత్రే బాధ్యుడని ఆమె ఆరోపించారు.

నామినేషన్ల పేరుతో రూ.1,148 కోట్ల దోపిడీ

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తన అనుచరులకు ప్రభుత్వ పెద్దలు టెండర్లు ఇష్టారీతిన కట్టబెడుతున్నారని కవిత విమర్శించారు. గ్రామాల్లో రూ.5 లక్షల పనికైనా టెండర్లు పిలుస్తారని అన్నారు. కానీ జీహెచ్‌ఎంసీలో రూ.1,148 కోట్ల పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. ఇది తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్‌కు పూర్తి వ్యతిరేకమని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడుతోందని, వెంటనే నామినేషన్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా (HYDRA) పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. స్క్వేర్ ఫీట్‌కు రూ.150 చొప్పున వసూలు చేస్తూ వ్యాపారులను వేధిస్తున్నారు. ఇప్పటికైనా ఈ బెదిరింపులు ఆపకపోతే మీ అవినీతి చిట్టాను ఈడీ (ED)కి అందజేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్లాట్లు అమ్మిన రూ.35 వేల కోట్లు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

కాళేశ్వరంపై కపట ప్రేమ.. రైతులపై కక్ష

కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం కర్కోటకంగా వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు. ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని నిరూపించడానికి ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇప్పుడు కమీషన్ల కోసమే మరమ్మత్తుల పేరుతో నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో బీజేపీ తన బీసీ వ్యతిరేకతను చాటుకుంటోందని ఆరోపించారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవడం మహిళలను మోసం చేయడమేనని, 2027 జనాభా లెక్కల ప్రకారం బీసీ జనగణన చేపట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఎంపీ అర్వింద్‌కు హెచ్చరిక

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తనపై చేసిన వ్యాఖ్యలపై కవిత ఘాటుగా స్పందించారు. ‘అర్వింద్‌కు తెలివి లేదు, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. తెలంగాణ ఆడబిడ్డలు స్వయం ప్రతిపత్తి గలవారు. నేను ఉద్యమంలో రాటుదేలిన బిడ్డను. నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి పార్టీ ఏర్పాటు కార్యక్రమం కోసం 21 కమిటీలను నియమించినట్లు ఆమె వెల్లడించారు. 500 మంది వాలంటీర్లతో సభ సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని కవిత తెలిపారు.

Next Story