- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైర్మన్ పదవి @ రూ.5 కోట్లు.! కౌన్సిలర్ల ఖర్చు భరించిన వారికే చాన్స్
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీలో పైరవీలు జోరందుకున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీలో పైరవీలు జోరందుకున్నాయి. చైర్మన్ పీఠాన్ని తమకే ఇవ్వాలని ప్రతి మున్సిపాలిటీలో ఆశావహులు లాబీయింగ్ షురూ చేశారు. ఈ పోటీని తమకు అనుకూలంగా మల్చుకున్న మెజార్టీ ఎమ్మెల్యేలు.. కౌన్సిలర్ల ఎన్నికల ఖర్చును భరించాలని షరతు పెట్టినట్లు తెలిసింది. ఆశావహుల నుంచి రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు డిపాజిట్ చేయించుకొని, ఆ డబ్బులతోనే ఎన్నికల ఖర్చును పూర్తి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ఒక్కో వార్డు చొప్పున..
రాష్ట్రంలో 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతుండగా, వందకు పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉండటంతో చైర్మన్ పదవిపై కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ఆ పదవిని దక్కించుకునేందుకు నామినేషన్ విత్ డ్రా రోజు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకోసం లోకల్ ఎమ్మెల్యే, మంత్రుల వద్ద పైరవీలు చేస్తున్నారు. మెజార్టీ పట్టణాల్లో చైర్మన్ పదవి కోసం ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతుండటంతో ఎమ్మెల్యేలు ఓ తిరకాసు పెట్టారు. పార్టీ తరపున ఒక్కో కౌన్సిలర్ ఎన్నికల ప్రచార ఖర్చు కింద ఒక్కో వార్డుకు రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల చొప్పున ముందే డిపాజిట్ చేయాలని కండీషన్ పెట్టినట్లు తెలిసింది. 20 వార్డులు ఉన్న మున్సిపాలిటీల్లో రూ.2 కోట్లు, 50 వార్డులు ఉన్నచోట రూ.5 కోట్లు డిపాజిట్ చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
డిపాజిట్ అమౌంట్‌కు సైతం పోటీలు
సాధారణంగా రూ.కోటి నుంచి రూ. 2 కోట్ల నగదు సమకూర్చడం పెద్ద సమస్య. కానీ మెజార్టీ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ పదవిని ఆశిస్తున్న లీడర్లు ఎమ్మెల్యేలు చెప్పిన అమౌంట్ ను ఇచ్చేందుకు పోటీ పడినట్లు తెలుస్తున్నది. నామినేషన్ విత్ డ్రా తెల్లారి, మరునాడు ఆయా పట్టణాల్లో వార్డుకు రూ. 10 లక్షల చొప్పున ఎన్నికల ఫండ్‌ను ఎమ్మెల్యేలకు ముట్టజెప్పి.. చైర్మన్ పదవిని ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. అయితే, కొన్ని పట్టణాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు చైర్మన్ పదవి కోసం పోటీ పడి.. అడిగిన అమౌంట్‌ను డిపాజిట్ చేసేందుకు ముందుకు వస్తే, అందరి దగ్గరి నుంచి నగదును తీసుకున్నట్లు టాక్. ఎన్నికలు పూర్తయిన తరువాత ఎవరికి చైర్మన్ పదవి ఇవ్వాలనే అంశంపై ఇన్‌చార్జి మంత్రి డైరెక్షన్ మేరకు తుది నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ఎమ్మెల్యేలు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.
పరోక్ష పద్ధతిలో..
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ముందుగా కౌన్సిలర్లను ప్రజలు ఎన్నుకుంటారు. ఆ తరువాత చైర్మన్ ఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నిక తేదీని ప్రకటిస్తుంది. ఆ రోజున పార్టీల తరపున బరిలోకి దిగిన చైర్మన్ అభ్యర్థులకు మద్దతుగా కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో మెంబర్లు చేతులు ఎత్తి ఓటు వేయాలి. ఎక్కువ ఓట్లు వచ్చిన కౌన్సిలర్‌ను చైర్మన్ ప్రకటిస్తారు.






