పూలేకు భారతరత్న పురస్కారం కేంద్రం ప్రకటించాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

by Ramesh Naini |   (  Updated:2026-04-11 16:06:09  IST  )

పూలే జయంతి వేడుకలు తెలంగాణ భవన్​లో ఘనంగా నిర్వహించారు. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

పూలేకు భారతరత్న పురస్కారం కేంద్రం ప్రకటించాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
X

దిశ, తెలంగాణ బ్యూరో : పూలే జయంతి వేడుకలు తెలంగాణ భవన్​లో ఘనంగా నిర్వహించారు. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలేకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా, జనాభాలో సగభాగం ఉన్న మహిళల విద్యా వికాసం, సమ సమాజం కోసం అహర్నిశలు కృషి సల్పిన మహనీయులు పూలేకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాల్సిందిగా పార్లమెంట్ వేదికగా తాను పోరాడుతానన్నారు. పూలేకు భారతరత్న ప్రకటించడం గౌరవంగా, సముచితంగా ఉంటుందన్నారు. జనాభాలో సగం భాగం ఉన్న మహిళలు కూడా చదువుకోవాలని, తద్వారా కుటుంబాలు, దేశం పురోభివృద్ధి చెందుతుందని, అందుకోసం కృషి చేసిన పూలే దార్శనికులని కొనియాడారు. ఆ మహాత్ముని స్ఫూర్తితో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మహానేత కేసీఆర్ అసెంబ్లీ మొట్టమొదటి సమావేశాలలోనే చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు జరగాలంటూ తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేశారని గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్స్ అమలు కోసం ఈనెల 16,17,18 వ తేదీలలో పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి,మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పూలే ఆశయాలకు ప్రతిరూపం మోడీ పాలన : లక్ష్మణ్

ఇదిలా ఉండగా, పూలే ఏ సామాజిక మార్పు కోసం పరితపించారో, నేడు ప్రధాని మోడీ ఆయన ఆశయాలను అక్షరాలా అమలు చేస్తూ మహిళల సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, పూలే చిత్రపటానికి పూలమాల అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే దార్శనికతతోనే మహిళా విద్యకు పునాది పడిందని గుర్తుచేశారు. సమాజంలో మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం ముందుకు వెళ్తుందనే బలమైన నమ్మకంతో జీవించిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. అంటరానితనం, స్త్రీలపై ఉన్న సామాజిక కట్టుబాట్లను ఎదురించి, తన సతీమణి సావిత్రిబాయి పూలేకు విద్యను అందించి, 1848లోనే బాలికల కోసం దేశంలో తొలి పాఠశాలను స్థాపించిన ఘనత జ్యోతిబా పూలేకు చెందుతుందని పేర్కొన్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తితో జ్ఞాన సంపద అందరికీ చేరాలని, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల మహిళలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును దశాబ్దాల పాటు అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలదని విమర్శించారు. పార్లమెంటులోనే బిల్లును చింపివేసి మహిళలను అవమానించిన పార్టీలతో కాంగ్రెస్ ఇప్పటికీ కలిసి నడుస్తోందని విమర్శించారు. మహిళా హక్కుల పట్ల కాంగ్రెస్‌కు ఎప్పుడూ చిత్తశుద్ధి లేకుండా, కేవలం ఓట్ల రాజకీయమే వారి లక్ష్యంగా మారిందని ఆరోపించారు. మహాత్మా జ్యోతిబా పూలే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన పోరాటాన్ని నేడు అదే నిబద్ధతతో ప్రధాని మోడీ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

Next Story