ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కేంద్రం వాటా ఇవ్వాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

by Ramesh Naini |

దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని, లేదా రాష్ట్రాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని పంచుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కేంద్రం వాటా ఇవ్వాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని, లేదా రాష్ట్రాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని పంచుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన బీజేపీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఒక్కరోజులో ఏర్పడినవి కాదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన వారసత్వ సమస్య అని స్పష్టం చేశారు. ఆనాడు మౌనంగా ఉన్న బీజేపీ నేతలకు నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసే నైతిక హక్కు లేదన్నారు.

వయోపరిమితి తగ్గింపుపై సవాల్..

ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయోపరిమితిని 21 సంవత్సరాలకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని తెలిపారు. ఈ అంశంపై నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారని, దీనికి కేంద్రం మద్దతు ఇస్తుందా లేదా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణకు బీజేపీ మద్దతు ఇస్తుందా? లేదా? తేల్చి చెప్పాలని సవాల్ విసిరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ నాయకులు... తాము పాలిస్తున్న రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఎక్కడ అమలు చేస్తున్నారో బహిరంగంగా చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

Next Story