- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగి ఉన్న క్రేన్ ను ఢీకొన్న బైక్.. ఒకరు మృతి
జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై నో పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన క్రేన్ కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన కల్వకుర్తి పట్టణంలో చోటుచేసుకుంది.

దిశ, కల్వకుర్తి: జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై నో పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన క్రేన్ కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన కల్వకుర్తి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వంగూర్ మండలం కోనేటిపురం గ్రామానికి చెందిన శ్రీరామదాసు సాయి కుమార్ (27) వృత్తిరీత్యా గోల్డ్‌స్మిత్. ప్రస్తుతం కుటుంబంతో కలిసి కల్వకుర్తి పట్టణంలో నివాసముంటూ బంగారు ఆభరణాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం వ్యాపార పనుల నిమిత్తం తన బుల్లెట్ బైక్ (టీజీ 31ఏ 1918)పై వంగూర్ మండలానికి వెళ్లిన సాయి కుమార్, అర్ధరాత్రి అనంతరం తిరిగి కల్వకుర్తికి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై కన్యకా పరమేశ్వరి ఆలయం కమాన్ సమీపంలో నో పార్కింగ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన క్రేన్ (టీజీ 31 9105) వెనుక భాగాన్ని బైక్ బలంగా ఢీకొట్టాడు. అర్ధరాత్రి కావడం, క్రేన్ సరిగా కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సాయి కుమార్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబానికి అండగా ఉన్న కుమారుడు అకాల మరణం చెందడంతో తల్లి జయమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. నిబంధనలకు విరుద్ధంగా నో పార్కింగ్ ప్రాంతంలో క్రేన్ నిలిపివేయడమే తన కుమారుడి మృతికి కారణమని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు క్రేన్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కల్వకుర్తి ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు. ఈ ఘటనతో కల్వకుర్తి పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తోటి గోల్డ్‌స్మిత్ మృతి చెందడంతో సంఘీభావంగా పట్టణంలోని బంగారు ఆభరణాల దుకాణాలను ఆదివారం స్వచ్ఛందంగా మూసివేశారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు జాతీయ రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నిలిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.






