Sugar: చక్కెర ధరలకు మళ్లీ రెక్కలు

by S Gopi |

ఈ పరిస్థితిలో ధరలను అదుపులో ఉంచేందుకు చక్కెర మిల్లులు, వ్యాపారులపై నిల్వ పరిమితులు విధించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Sugar: చక్కెర ధరలకు మళ్లీ రెక్కలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల చక్కెర ధరలు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో మిల్లుల వద్ద ధరలు క్వింటాల్‌కు రూ.4,400-4,500కు చేరుకోగా, ఢిల్లీలో టోకు ధరలు రూ.4,750-4,800 మధ్య ఉన్నాయి. కేవలం నెల రోజుల్లోనే ధరలు సుమారు రూ.300 పెరిగాయి. ఇదే ధోరణి కొనసాగితే అక్టోబర్‌లో కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే నాటికి మిల్లుల వద్ద ధరలు క్వింటాల్‌కు రూ.5,000-5,100 వరకు వెళ్లే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిలో ధరలను అదుపులో ఉంచేందుకు చక్కెర మిల్లులు, వ్యాపారులపై నిల్వ పరిమితులు విధించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే పరిశ్రమ వర్గాల అభిప్రాయం ప్రకారం, నిల్వలపై ఆంక్షలు ధరలను తాత్కాలికంగా నియంత్రించినా, సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉంది. పరిశ్రమ సంఘాలు మాత్రం దేశీయ అవసరాలకు తగినంత చక్కెర నిల్వలు ఉన్నాయని, భయంతో కొనుగోళ్లు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఉత్పత్తి తగ్గడం, ఇథనాల్ తయారీకి భారీగా చక్కెర మళ్లించడం, అలాగే ఈ ఏడాది జరిగిన ఎగుమతులేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం ఉత్పత్తి 2.8 కోట్ల టన్నులను మించదని అంచనా. ఇందులో దాదాపు 29 లక్షల టన్నులు ఇథనాల్ తయారీకి, మరో 8 లక్షల టన్నులు ఎగుమతులకు వెళ్లాయి. దీంతో అక్టోబర్ నాటికి నిల్వలు 35-37.5 లక్షల టన్నులకు తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ, నెలవారీ వినియోగంతో పోలిస్తే ఇవి సరిపోతాయని పరిశ్రమలు చెబుతున్నాయి. మరోవైపు, చక్కెర ధరలు పెరగడంతో మిల్లులకు ఇథనాల్ కంటే చక్కెర విక్రయాలే ఎక్కువ లాభదాయకంగా మారుతున్నాయి. దీంతో కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమంపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఎగుమతులపై ప్రభుత్వం తరచూ విధానాలు మార్చడం వల్ల మిల్లులకు దీర్ఘకాలిక ఉత్పత్తి ప్రణాళికలు రూపొందించడం కూడా కష్టమవుతోందని పరిశ్రమ అభిప్రాయపడుతోంది.

Next Story