Google: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్

by S Gopi |

ఇది పాస్‌వర్డ్‌కు ప్రత్యామ్నాయం కాదు, కేవలం అదనపు రికవరీ ఆప్షన్ మాత్రమేనని కంపెనీ తెలిపింది.

Google: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ కస్టమర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'సెల్ఫీ ఫర్ సైన్-ఇన్' పేరుతో తెచ్చిన కొత్త అకౌంట్ రికవరీ ఫీచర్‌ ద్వారా పాస్‌వర్డ్, ఫోన్ లేదా ఇతర సైన్-ఇన్ విధానాలకు యాక్సెస్ కోల్పోయినప్పుడు, ఒక చిన్న సెల్ఫీ వీడియో ద్వారా తమ ఐడెంటిటీని వెరిఫై చేసుకుని అకౌంట్‌ను తిరిగి పొందేందుకు ఉపయోగపడుతుంది. ఇది పాస్‌వర్డ్‌కు ప్రత్యామ్నాయం కాదు, కేవలం అదనపు రికవరీ ఆప్షన్ మాత్రమేనని కంపెనీ తెలిపింది. దీనికోసం కస్టమర్లు మొదట ఫేస్‌ను వివిధ కోణాల్లో తిప్పుతూ ఒక రిఫరెన్స్ వీడియో రికార్డ్ చేయాలి. భవిష్యత్తులో అకౌంట్ రికవరీ అవసరమైతే మరో సెల్ఫీ వీడియో తీసి, రెండింటినీ ఏఐ ఆధారిత ఫేషియల్ మ్యాచింగ్, లైవ్‌నెస్ డిటెక్షన్, హెడ్ మూవ్‌మెంట్ వెరిఫికేషన్ వంటి సెక్యూరిటీ వెరిఫికేషన్‌లతో గూగుల్ పోల్చి ఐడెంటిటీని ధృవీకరిస్తుంది. ఫోటోలు, రికార్డ్ చేసిన వీడియోలు లేదా ఏఐతో రూపొందించిన డీప్‌ఫేక్‌ల ద్వారా మోసాలను అడ్డుకోవడమే దీని లక్ష్యమని గూగుల్ పేర్కొంది. ఈ వీడియోలు ఎన్‌క్రిప్ట్ రూపంలో స్టోర్ అవుతాయని, కస్టమర్ అడిగినప్పుడు వాటిని ఎప్పుడైనా తొలగించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ ఫీచర్‌పై సైబర్ సెక్యూరిటీ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పాస్‌వర్డ్ లీకైతే మార్చుకోవచ్చు. కానీ ఒకసారి ముఖానికి సంబంధించిన బయోమెట్రిక్ డేటా దుర్వినియోగం అయితే దానిని మార్చడం సాధ్యం కాదంటున్నారు. నకిలీ వెబ్‌సైట్లు లేదా ఫిషింగ్ లింక్‌ల ద్వారా సెల్ఫీ వీడియోలు ఇవ్వకూడదని నిపుణులు వెల్లడించారు.

Next Story