రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రం కుట్రలు..! లేఖ రాసినా పట్టించుకోని వైనం

by Kema Shiva Kumar |

యాసంగి సీజన్​ ప్రారంభమైన ఇప్పటి వరకు యూరియా నిల్వలపై వ్యవసాయ శాఖ తర్జనభర్జన పడుతోంది.

రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రం కుట్రలు..! లేఖ రాసినా పట్టించుకోని వైనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి సీజన్​ ప్రారంభమైన ఇప్పటి వరకు యూరియా నిల్వలపై వ్యవసాయ శాఖ తర్జనభర్జన పడుతోంది. గత వానాకాలంలో ఎదురైన సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఈసారి ముందుగానే నిల్వలు ఉంచేందుకు ప్లాన్​చేస్తోంది. రెండు నెలల కితం ఈసీజన్‌కు 10.40 లక్షల మెట్రిక్​టన్నులు యూరియా అవసరం ఉంటుందని కేంద్రానికి లేఖ రాసింది. ఆలస్యం చేయకుండా అక్టోబర్, నవంబర్, డిసెంబర్​మాసాల్లో నెలకు 2 లక్షల మెట్రిక్​టన్నులు దిగుమతి చేయాలని కోరింది. అక్టోబర్, నవంబర్​నెలలు పూర్తికావస్తున్న కేటాయింపులు చేసిన విధంగా సరఫరా చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు నెలల కాలంలో 70 శాతం దిగుమతి చేసి మిగతా యూరియా మరో రెండు నెలలో ఇచ్చిన పర్వాలేదని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్​మొదటి వారం వరకు 5 లక్షల మెట్రిక్​టన్నులు యూరియా రాష్ట్రంలో అందుబాటులో ఉంటే రైతులకు సకాలంలో పంపిణీ చేయవచ్చని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఒకే వేళ ఆలస్యం జరిగితే మళ్లీ రైతులు రోడ్లపైకి వస్తారని అంచనా వేసి ఏ విధంగానైనా కేంద్రాన్ని ఒప్పించి యూరియా తీసుకొచ్చేందుకు తంటాలు పడుతుంది. ఈనెల మొదటి వారంలో మంత్రి తుమ్మల యూరియా సరఫరాపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి యూరియా కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే గత సీజన్​పరిస్ధితులు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. దీంతో అధికారులు కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయిన కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 2.50 లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా..

కేంద్రం అక్టోబర్, నవంబర్ నెలలకు రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల మేర యూరియా కేటాయించింది. అక్టోబర్‌కు సంబంధించి 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఓడరేవుల నుండి రాష్ట్రానికి చేరుకోగా, ఈనెలకు సంబంధించినది 25 వేల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి చేరుకుంది. రాష్ట్రంలో 2.60 లక్షల మెట్రిక్ టన్నులు అక్టోబర్ నుండి ఇప్పటివరకు సరఫరా జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.55 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 65 టన్నుల డీఎపీ, 2.30 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఈ నిల్వలు ఒక నెల రోజులో పంపిణీ చేయవచ్చని, మిగతా రెండు నెలలో రైతులకు యూరియా పంపిణీ జరగడం కష్టమైతుంది. ఇప్పటికే మండల వ్యవసాయ శాఖ అధికారులు పంటలు వేసిన రైతులు ఏ మేరకు యూరియా వాడకం చేస్తారో పట్టాపాసు బుక్​వివరాలు ఇచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు అధికారులు వివరాల ప్రకారం 6 లక్షల మెట్రిక్​టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేశారు.

రైతులు వ్యతిరేకమయ్యేలా కుట్రలు..

త్వరలో సర్పంచి మరో నెల రోజుల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుండటంతో రేవంత్​ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కేంద్ర సర్కార్​కుట్రలు చేస్తోందని కిసాన్​సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీ తన సత్తా చాటడంతో కమలనాథులు ఉనికి చాటలేక చితికిలా పడ్డారు. అదే అక్కసుతో స్థానిక ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉండేలా యూరియా నిల్వలు ఆలస్యం చేసేందుకు ఎత్తులు వేస్తుందని విమర్శలు చేస్తున్నారు. జూలై, ఆగస్టు నెలలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయని అప్పడు ప్రచారం జరిగితే రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసేలా విపక్ష పార్టీలు ఉసిగొల్పాయి. ఇప్పడు యాసింగి సీజన్​సమయంలో రావడంతో మరోసారి తమ కుటిల బుద్దిని కేంద్రం చాటుకునేందుకు రైతులకు ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ప్రజల్లో రేవంత్​సర్కార్​ను ఎదుర్కొనలేక దొంగ దెబ్బతీసేందుకు పడరాని తిప్పలు పడుతుందని కాంగ్రెస్​నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. హస్తిన ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారని భావిస్తున్నారు.

Next Story