- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు వరప్రదాయినిగా ఎల్లంపల్లి.. మరి కాళేశ్వరం సంగతేంటి?
తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వరం అని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం మరోసారి తప్పు అని తేలిపోయింది. రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు ఎటూ పనికిరాకుండాపోయిందని మరోసారి నిరూపితమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వరం అని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం మరోసారి తప్పు అని తేలిపోయింది. రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు ఎటూ పనికిరాకుండాపోయిందని మరోసారి నిరూపితమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేకుండానే రాష్ట్రవ్యాప్తంగా జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఎక్కడికక్కడ నీటి వనరులు నిండిపోయాయి. మరోవైపు.. గత కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం రాష్ట్రానికి మరోసారి వరప్రదాయినిగా నిలిచింది. దాంతో బీఆర్ఎస్ వాదన పనికిరాకుండా పోయింది.
రూ.లక్ష కోట్లతో నిర్మించినా..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును, అందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించింది. సుమారు రూ.లక్ష కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా నీరందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామంటూ గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ, ప్రాజెక్టు గత అసెంబ్లీ ఎన్నికల వేళ కుంగుబాటుకు గురైంది. మేడిగడ్డ బ్యారేజీకి చెందిన రెండు పియర్లు కుంగిపోయాయి. ఈ ప్రమాదాన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణలు జరిపించింది. అంతేకాకుండా.. ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగమూ లేదని ముందు నుంచీ వాదిస్తూనే ఉన్నది.
కరెంటు బిల్లుల భారం..
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూడు బ్యారేజీల ద్వారా నీటిని పంపింగ్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న అంశం. ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఒక్కసారి పంపింగ్ చేయించినందుకే రూ.వేల కోట్ల కరెంటు బిల్లులు వచ్చాయి. అలా ప్రతీసారి లిఫ్టింగ్ చేసి నీటిని అందించాలంటే రూ.వేల కోట్ల ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ ముందు నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నది. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తడిసిమోపెడు కాగా.. కరెంటు బిల్లులు మరింత భారంగా మారాయి. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుకు గురైనప్పటి నుంచి అందులో నీరు నిల్వ ఉంచడం లేదు. నీళ్లు నిలిపితే ప్రమాదం తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అందుకు సాహసించడం లేదు. ఆ ప్రాజెక్టుతో సాగుభూమి అదనంగా వినియోగంలోకి వచ్చిందనే సంగతి ఎలా ఉన్నా రెండేండ్లలో కరెంటు ఖర్చు కోసమే రూ.2,090 కోట్లు (3,604 మిలియన్ యూనిట్లు) వెచ్చించాల్సి వచ్చింది. ఎత్తిపోసిన నీరు మాత్రం కేవలం 99 టీఎంసీలే. అంతేకాకుండా 2019 నుంచి మేడిగడ్డ ఎత్తిపోసింది కేవలం 162 టీఎంసీలేనని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందులో మళ్లీ తిరిగి సముద్రంలోకే 118 టీఎంసీలు వదిలేయడం గమనార్హం. నికరంగా ఈ ఐదేండ్లలో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్లు కేవలం 44 టీఎంసీలు కావడం గమనార్హం. 2022లో కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌లు భారీ వరదలకు మునిగిపోయాయి. 2023లో ఆ బ్యారేజీ కుంగిపోయి లిఫ్టింగ్ పూర్తిగా నిలిచిపోయింది.
తెలంగాణకు వరప్రదాయినిగా ఎల్లంపల్లి
నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు మరోసారి తెలంగాణకు వరప్రదాయిగా మారింది. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి పెద్ద స్థాయిలో ఇన్ ఫ్లో వస్తుండడంతో ఎల్లంపల్లి పూర్తిగా నిండిపోవడమే కాకుండా దానికి అనుసంధానంగా ఉన్న ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరుతున్నది. మిడ్ మానేరు, ఎల్ఎండీ నిండిపోగా.. మల్లన్నసాగర్, కొండపోచమ్మకు సైతం పంపింగ్ ద్వారా నీరందుతున్నది. దాంతో ఎలాంటి కరెంటు ఖర్చు లేకుండానే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు, చెరువులు నిండిపోయాయి. ప్రాజెక్టులు గేట్లు తెరుచుకుంటుండగా.. చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి.
బీఆర్ఎస్‌పై విమర్శలు
కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అంటూ ముందు నుంచీ బీఆర్ఎస్ వాదిస్తూ వస్తున్నది. కానీ.. ప్రస్తుత పరిస్థితిల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేకుండానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దాంతో బీఆర్ఎస్ చెబుతున్నవి అవాస్తవాలేనని మరోసారి తేలిపోయింది. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకున్నా.. అక్కడి నుంచి వరదను వినియోగించుకోకున్నా అన్ని జలాశయాలకు నీరు చేరుతున్నది. దీంతో గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు వృథా చేసిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలోనూ భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్టు ప్రచారం జరుగుతుండడంతో బీఆర్ఎస్ వీటన్నింటి నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్నది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన అధికారుల వద్దే రూ.వందల కోట్ల డబ్బులు పట్టుబడ్డాయి. దాంతో అవినీతి ఏ స్థాయిలో జరిగి ఉంటుందోనన్న చర్చ నడుస్తున్నది. ఇంత చేసినప్పటికీ ప్రాజెక్టు ఉపయోగపడకపోవడంతో విమర్శలు మరింత రెట్టింపయ్యాయి.






