మున్సిపల్ ఎన్నికల సందడి షురూ.. జోరుగా ప్రధాన పార్టీల సన్నాహక సమావేశాలు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని పట్టణాల్లో ఓవైపు సంక్రాంతి పండుగ సందడితో పాటు మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొంది.

మున్సిపల్ ఎన్నికల సందడి షురూ.. జోరుగా ప్రధాన పార్టీల సన్నాహక సమావేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పట్టణాల్లో ఓవైపు సంక్రాంతి పండుగ సందడితో పాటు మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొంది. మున్సిపల్​ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తన సన్నద్ధతను ఎన్నికల సంఘానికి తెలియజేయగా.. ఈసీ ఎన్నికల పనులను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఓటరు జాబితాను వార్డుల వారీగా ఫైనల్​ చేసే పనిలో ఈసీ నిమగ్నమైంది. ఎన్నికల సంఘం, ప్రభుత్వం రెండు కూడా ఎన్నికలకు సన్నద్ధం కావడంతో పట్టణ ప్రాంత రాజకీయ పార్టీల కేడర్‌లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. పరిషత్​ఎన్నికల అనంతరం మున్సిపల్​ఎన్నికలు ఉంటాయని ముందుగా అంచనా వేసినా అది రివర్స్ అయ్యింది. గతానికి భిన్నంగా ముందుగా మున్సిపల్​ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాజకీయ నాయకులు ఈనెల 1న ప్రకటించిన ఓటరు జాబితా ముసాయిదాలో తమ వార్డు ఓటరు జాబితాను సరిచూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఏ సామాజిక వర్గ ఓట్లు ఎన్ని ఉన్నాయనే విశ్లేషణ చేసుకుంటున్నారు. తమ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వ్​అవుతుంది? ఏ వర్గానికి రిజర్వ్​అయితే ఎవరెవరు పోటీలో ఉంటారు? తమకు, తమ సామాజిక వర్గానికి ఎంత వరకు చాన్స్​ఉంటుంది? పార్టీలో ప్రత్యర్థులు ఎవరు? పోటీలో ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? ఇలాంటి లెక్కలు వేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఎన్నికల ఖర్చుపై ఆరా?

ఎన్నికలకు ముందు గానే వార్డులో తమ పార్టీ నాయకులు, తమ అనుచరులతో నేతలు చర్చలు జరుపుతున్నారు. వీటికి తోడు ఎన్నికల్లో ఎంత ఖర్చు అవుతుంది? తాము ఎంతవరకు ఖర్చును భరించగలుగుతామనే విషయాలను తమ ఆనుచరులు, శ్రేయోలాభిషులు, వార్డులోని బంధువులు ఇతరులతో చర్చిస్తున్నారు. ఆశావహులు ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు. అందుకే లెక్కల మీద లెక్కలు వేస్తున్నారు. అన్ని పార్టీల్లోని వార్డు స్థాయి నాయకులందరూ ఇదే పనిలో బిజీగా ఉన్నారు. దీంతో వార్డుల్లో రాజకీయ కోలాహలం నెలకొంది. గతంలో ఉన్న వార్డుల రిజర్వేషన్‌ల ఆధారంగా ఈసారి ఏ సామాజిక వర్గానికి రిజర్వ్​అవుతుందా? అని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా తామే బరిలో ఉంటామని ప్రకటించుకుంటున్నారు.

ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో..

పార్టీ గుర్తుల మీద మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో నాయకులు బిజీగా ఉన్నారు. రెండేండ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని గుర్తుచేసే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్​నుంచి పార్టీలో చేరిన వారికి కాకుండా తమకే టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్​కూడా త్వరలోనే నియోజకవర్గ, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నది. పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావడంతో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కూడా వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడా తేడా వచ్చినా పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో తమపై చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఎన్నికల్లో గెలుపునకు పార్టీ అభ్యర్థుల ఎంపిక కీలకం కావడంతో ఒక్కో సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసుకుని పార్టీలు సిద్ధంగా ఉంచుకుంటున్నట్టు తెలుస్తున్నది.

కత్తిమీద సాములా అభ్యర్థుల ఎంపిక..

వార్డు స్థాయిలో బలహీనమైన అభ్యర్థులు ఉన్న దగ్గర టిక్కెట్టు ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న బలమైన నేతల విజ్ఞప్తులను పార్టీల నేతలు పరిశీలిస్తున్నారు. బలమైన అభ్యర్థులు, గెలుస్తారని నమ్మకం ఉన్నవారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అధికార పార్టీలో అభ్యర్థుల పోటీ భారీగా ఉన్నది. దీంతో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలకు అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారనుందని తెలుస్తున్నది. రెబెల్స్‌ను బుజ్జగించడం, బరిలో నిలిచిన అభ్యర్థిని గెలిపించడం, మేయర్, చైర్మన్‌ స్థానాలను పార్టీ కైవసం చేసుకునేలా చూడటం నిజంగా పరీక్షే అని అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష నాయకుల్లోనూ చర్చ జరుగుతున్నది. అందుకే ముందుగానే బలమైన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన సర్పంచ్​ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో 16 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర అధినాయకత్వం క్లాస్ పీకింది. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తక్కువ సీట్లు సాధించి, మున్సిపల్ చైర్మన్ పదవిని ప్రత్యర్థి పార్టీలు కైవసం చేసుకుంటే సదరు ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమేనని అధికార పార్టీ కీలక నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ, బీఆర్‌ఎస్​పార్టీలు ఈ ఎన్నికల్లో తమ ప్రాబల్యం పెంచుకోవడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

Next Story