కరీంనగర్ ఘటనపై బీఆర్ఎస్ సీరియస్.. డీజీపీ ముందు 7 డిమాండ్లతో వినతి పత్రం

by Prasad Jukanti |   (  Updated:2026-05-08 07:25:06  IST  )

కరీంనగర్ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. బండి సంజయ్‌పై FIR నమోదుతో పాటు 7 డిమాండ్లు ఉంచారు.

కరీంనగర్ ఘటనపై బీఆర్ఎస్ సీరియస్.. డీజీపీ ముందు 7 డిమాండ్లతో వినతి పత్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్ఎస్(BRS) నేతల మీద జరగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ డీజీపీ(Telangana DGP) సీ.వీ ఆనంద్ ను శుక్రవారం ఆయన కార్యాలయంలో కలిశారు. నిన్న కరీంనగర్‍లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై దాడి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ దాడితో కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సంబంధం ఉందని అందువల్ల కేంద్ర మంత్రిని నిందితుడిగా చేర్చి ఎఫ్‍ఐఆర్ నమోదు చేయడంతో పాటు కౌశిక్ రెడ్డికి భద్రత కల్పించడంతో పాటు మరికొన్ని డిమాండ్లతో కూడిన వినపతి పత్రాన్ని డీజీకి అందజేశారు.

కేటీఆర్ అందుకోసమే వెళ్లారు:

మే 4వ తేదీన కరీంనగర్‌లో పట్టపగలే ఒక జ్యువెలరీ షాపులో సాయుధ దోపిడీ జరిగిందని, ఆ బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారని లేఖలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గుర్తు చేశారు. వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు స్థానిక పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ విమర్శించింది.

బీఆర్ఎస్ డిమాండ్లు ఇవే:

1.నిన్న కరీంనగర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన FIRలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను నిందితుడిగా తక్షణమే చేర్చడంతో పాటు ఆయనపై తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి.

2.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల బండి సంజయ్ చేసిన అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే మరియు పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలపై విడిగా మరో FIR నమోదు చేయాలి.

3.ఈ కేసు దర్యాప్తును ఒక నిష్పాక్షికమైన సీనియర్ అధికారికి అప్పగించాలి. బాధితుడైన ఎమ్మెల్యే, ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసి నిర్ణీత కాలవ్యవధిలో పారదర్శకంగా విచారణ జరపాలి.

4.బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు ముఖ్యంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ముప్పు పొంచి ఉన్న ఇతర బీఆర్ఎస్ నాయకులకు పటిష్టమైన భద్రత కల్పించాలి.

5.మే 7 నాటి హింసను అరికట్టడంలో విఫలమైన, దాడి జరుగుతున్నప్పుడు స్పందించని, అలాగే FIRను తారుమారు చేసిన కరీంనగర్ పోలీసు అధికారులపై కఠిన క్రిమినల్ మరియు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. మే 4న జరిగిన జ్యువెలరీ షాప్ షూటింగ్, దోపిడీని అదుపు చేయడంలో విఫలమైన వారిపై కూడా చర్యలు తీసుకోవాలి.

6.కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇచ్చే ఫిర్యాదులను ఎలాంటి భయం లేదా పక్షపాతం లేకుండా, వెంటనే నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలు జారీ చేయాలి.

7.పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ అవసరాలకు వాడుకోవడాన్ని సహించబోమని (Zero Tolerance), శాంతిభద్రతల విషయంలో పోలీసులు ఖచ్చితమైన తటస్థతను పాటించాలని స్పష్టం చేస్తూ ఒక సమగ్ర సర్క్యులర్ జారీ చేయాలి.

Next Story