హరితహారం @రూ.1000 కోట్ల స్కామ్.. ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ చెలగాటమాడిందా?

by Naga Rani Yarlagadda |

మొక్కల పెంపకం పేరిట గత బీఆర్ఎస్ సర్కార్ భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

హరితహారం @రూ.1000 కోట్ల స్కామ్.. ప్రజల ప్రాణాలతో బీఆర్ఎస్ చెలగాటమాడిందా?
X

దిశ, తెలంగాణ బ్యూరో : మొక్కల పెంపకం పేరిట గత బీఆర్ఎస్ సర్కార్ భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హరితహారం పథకానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది. పచ్చదనం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి ఏటా కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసింది. ఈ కార్యక్రమం నిర్వహణలో పటిష్ట పర్యవేక్షణ, నిరంతర తనిఖీలు లేకపోవడంతో చాలా చోట్లలో మొక్కలు నాటకుండనే రోడ్లపై పారవేశారు. పేరుకు మాత్రం మొక్కలు నాటినట్లు రికార్డుల్లో చూపించారు. కేటాయించిన నిధుల్లో మొక్కలు నాటేందుకు, నాటిన మొక్కలను సంరక్షించేందుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ మొక్కల పెంపకానికి మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. గత పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 293 కోట్ల మొక్కలు నాటితే.. వాటికి ఖర్చు చేసింది మాత్రం అక్షరాల రూ.824 కోట్లకు పైమాటే. ఖర్చు చేసిన నిధులకు తగ్గట్లుగా ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మొక్కలు నాటకుండానే నాటినట్లు..

కొన్ని చోట్ల మొక్కలు నాటకపోయినా నాటినట్టు రికార్డుల్లో చూపి నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో అవసరంలేని చోట్లలో నాటిన మొక్కలు నరికివేతకు గురయ్యాయి. రికార్డుల కోసం వివిధ శాఖల అధికారులు ఇష్టారాజ్యంగా మొక్కలు నాటారు. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో సైతం పారవేశారు. నిధులు కాజేసేందుకు స్థానికంగా లభించిన మొక్కలను నాటకుండా ఇతర ప్రాంతాల్లో నుంచి మొక్కలను కొనుగోలు చేసినట్లు లెక్కల్లో చూపించారు. స్థానికంగా తక్కువ ధరకు లభించే మొక్కలను కాదని.. దూర ప్రాంతాలకు వెళ్లి మొక్కలు కొనుగోలు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి.

అనారోగ్య సమస్యలకు కారకమయ్యే మొక్కలు..

రాష్ట్రంలో చాలా చోట్ల, ప్రధాన కూడళ్లు, రహదారులకు మధ్యలో అనారోగ్య సమస్యలకు కారకమయ్యే కోనోకార్పస్ మొక్కలను గత బీఆర్ఎస్ సర్కార్ విపరీతంగా నాటించింది. ఈ మొక్కల ద్వారా వెలువడే వాసన పీలిస్తే శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో కొన్ని రసాయనాలు విడుదలై శ్లేష్మం(మ్యూకస్) పెరిగిపోయి కఫం, దగ్గు, శ్వాసంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో నాటిన ఈ మొక్కలను ప్రస్తుత ప్రభుత్వం నరికి వేయించింది. అయితే, పనికిరాని మొక్కలు నాటి కూడా పెద్ద ఎత్తున నిధులు కాజేసినట్లు విమర్శలు వచ్చాయి. గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘హరిత వనం’ నర్సరీల్లో కోనోకార్పస్‌ను పెంచవద్దని ప్రస్తుత ప్రభుత్వం లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది. అయితే, హైదరాబాద్ నగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ పరిధిలో కోనోకార్పస్ మొక్కలను గత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పెంచింది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఆ మొక్కలను తొలగించారు. ఇదిలాఉండగా, హరితహారం పేరుతో కేసీఆర్ హయాంలో ఈ స్కీం కోసం ఖర్చు చేసిన నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని ప్రస్తుత ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.

హ‌రిత‌హారం మొక్కల‌పై విచార‌ణ జ‌రిపించండి : యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్షన్ ఫౌండ‌ర్ రాజేంద్ర ప‌ల్నాటి

గ‌త ప‌దేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో హ‌రిత‌హారం కార్యక్రమానికి భారీగా నిధులు ఖర్చుచేశారు. ప‌దేళ్లలో దాదాపు రూ.వెయ్యి కోట్ల నిధులను కేవలం మొక్కల పెంపకానికి వినియోగించారు. కోట్లలో మొక్కలు నాటినట్లు చెబుతున్నా క్షేత్ర స్థాయి లెక్కలకు చాలా తేడా ఉంది. ఈ వ్యవహారంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విచార‌ణ జ‌రిపించాలి. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చ‌ర్యలు తీసుకోవాలి.

Next Story