- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ పరిపాలనకు దిక్సూచీ భూ భారతి.. రేపటితో ఈ చట్టానికి ఏడాది పూర్తి
భూ హక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతి రహిత సేవలు సామాన్యుడికి సులభంగా అందేలా తీసుకొచ్చిన భూ భారతి చట్టానికి ఏప్రిల్ 14తో ఏడాది పూర్తి చేసుకుంటుంది

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పునర్నిర్మిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ హక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతి రహిత సేవలు సామాన్యుడికి సులభంగా అందేలా గత ఏడాది తీసుకొచ్చిన భూ భారతి చట్టం తెలంగాణ చరిత్రలో కీలక సంస్కరణగా నిలుస్తోందన్నారు. మంగళవారంతో (ఏప్రిల్ 14వ తేదీ) భూ భారతి చట్టం అమలులోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో భూ భారతి చట్టంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక చట్టానికి ఏడాది పూర్తైన సందర్భం మాత్రమే కాదని, తెలంగాణ రాష్ట్రంలో భూహక్కుల రక్షణకు ప్రారంభమైన కొత్త శకానికి నాంది పలికిన రోజని అన్నారు. భూ భారతి చట్టానికి ముందు, తర్వాత ఉన్న పరిస్ధితులపై అధికారులతో చర్చించారు. ఈ చట్టం తీసుకువచ్చే నాటికి ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొన్న పరిస్ధితులను గుర్తు చేశారు.
బలమైన ఆయుధం
తెలంగాణ రైతాంగానికి భూ భద్రత కల్పించడంలో భూభారతి ఒక బలమైన ఆయుధంగా మారిందని మంత్రి పొంగులేటి అభిప్రాయపడ్డారు. భూ వివాదాలకు చరమగీతం పాడుతూ, సామాన్యుడికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తగ్గించడంలో ఈ ఏడాది కాలం ఒక గొప్ప ముందడుగుగా నిలిచిందన్నారు. 12 నెలల కాలంలో భూ భారతి పోర్టల్ పాత చిక్కుముడులను విప్పడంలో కీలక పాత్ర పోషించింది. ఈ పోర్టల్ ప్రారంభించిన ఏడాదిలోపే 5.20 కోట్లకు పైగా ప్రజలు ఈ పోర్టల్‌ను సందర్శించారన్నారు. 67 లక్షల మంది పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యారన్నారు. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎన్ఐసీతో కలిసి రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను ఈ నెల 2వ తేదీ నుంచి ఐదు జిల్లాల్లోని ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించామన్నారు. ఇక్కడ ఎదురయ్యే మంచి చెడులను పరిగణనలోకి తీసుకొని అవసరమైన మార్పులు, చేర్పులు చేసి వచ్చే నెలలో జిల్లాకు ఒక మండలంలో ప్రారంభిస్తామన్నారు. ఈ ఐదు మండలాల్లో కూడా ప్రతి సర్వే నెంబరుకు భూధార్ నెంబర్‌ను కేటాయిస్తామన్నారు.
గ్రామాల్లో నక్షాలు
రాష్ట్రంలో నిజాం కాలం నుంచి 378 గ్రామాలను నక్షాలు లేవని మంత్రి చెప్పారు. ఇందులో ఐదు గ్రామాలలో రీ సర్వే పూర్తి చేసి భూధార్ నెంబర్ కేటాయించామన్నారు. మిగిలిన 373 గ్రామాల్లో రోవర్స్ వంటి ఆధునిక సర్వే సాంకేతికతను ఉపయోగించి రీసర్వే పనులు కొనసాగిస్తున్నామన్నారు. జిల్లాకు 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సర్వే చేపట్టబోతున్నామని, సర్వే అనంతరం హద్దులను గుర్తించి భూధార్ నంబర్ ఇస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు వినియోగంలో ఉండగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు 77 సంవత్సరాలలో 2.99 కోట్లకు చేరాయన్నారు. వీటన్నింటికీ భూధార్ నంబర్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారుచేస్తున్నామన్నారు. గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం వీలైనంత వరకు వినియోగించుకుంటున్నాం. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేశామన్నారు. త్వరలో మరో 400 కొనుగోలు చేయబోతున్నాం. భూ భారతి పోర్టల్ ప్రారంభించిన గత ఏడాది ఏప్రిల్ 14 నుంచి ఇప్పటి వరకు 3.80 లక్షల పాస్ బుక్ లు జారీ చేసినట్లు వివరించారు.






