- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరంభమేమో ఘనం.. ఆచరణ మాత్రం శూన్యం
ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరును పర్యవేక్షించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ అమలులో జాప్యం జరుగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉపాధ్యాయుల హాజరును పర్యవేక్షించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ అమలులో జాప్యం జరుగుతోంది. ఈ వ్యవస్థను పాఠశాల విద్యాశాఖ సమర్థవంతంగా అమలు చేస్తామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆచరణ అంతంత మాత్రమేనని తేలింది. నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు తక్కువగా ఉంటున్నట్లు అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రూల్స్ అతిక్రమించిన వారిపై చర్యలు శూన్యం
పాఠశాల సమయానికి హాజరుకాని ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న విద్యాశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫేషియల్ రికగ్నిషన్ అటెండన్స్ సిస్టంను పటిష్టంగా అమలు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ చెబుతున్నప్పటికీ డీఈఓల పర్యవేక్షణ లేక ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలలో ఉన్నప్పుడు ఓపెన్ అవ్వాల్సిన స్కూల్ లొకేషన్, బయట ఎక్కడ ఉన్నా టీచర్ ఫొటోతో ఇన్ టైం, అవుట్ టైం పడుతున్నది. ఇలా ఫేషియల్ రికగ్నిషన్ అటెండన్స్ సిస్టంలో లోపాలను అధికారులు సరిదిద్దకుండా జాప్యం చేస్తున్నారు. గంట ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులపై ఒకరోజు సెలవుగా పరిగణిస్తామని, గంటన్నర ఆలస్యంగా వస్తే ఒకరోజు వేతనం కోత విధిస్తామని తెలిపారు. అంతేకాకుండా, ఇలా మూడుసార్లు ఆలస్యంగా వస్తే సర్వీసు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో వీటి అమలు దాదాపు శూన్యంగా కనిపిస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫేషియల్ రికగ్నిషన్ అటెండన్స్ సిస్టం ద్వారా ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులను గుర్తించినప్పటికీ, వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. ఒకట్రెండు చోట్ల మాత్రమే వేతనాల కోత విధించినట్లు అధికారిక వర్గాల సమాచారం.
అనర్హులతో బోధన
వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండల పరిధిలోని గాజులకుంటా తండా ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు మరొకరితో పాఠాలు చెప్పిస్తూ శుక్రవారం తనిఖీలకు వెళ్లిన అధికారులకు పట్టుబడ్డాడు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ, ఉద్యోగానికి మాత్రం రాకుండా ప్రైవేట్ వలంటీర్‌ని నియమించి పాఠశాల నడిపిస్తున్నాడు. బోధన విద్యార్హతలు లేని మహిళను పాఠాలు బోధించడానికి నియమించి ప్రతినెలా కొంత జీతంలా చెల్లిస్తున్నాడు. శుక్రవారం ఎంపీడీఓ వెంకన్న గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు పనుల జాతర కార్యక్రమంలో భాగంగా అక్కడకు వెళ్లారు. అక్కడ ఉపాధ్యాయుడు మొచ్చు వెంకటయ్య బదులు మరో మహిళ విద్యార్థులకు పాఠాలు బోధించడాన్ని గమనించిన ఎంపీడీఓ వివరాలు అడిగి తెలుసుకుని ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఇలా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ ఒత్తిళ్లు
ఇలా ఈ ఒక్కటే కాకుండా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఎన్నో కేసులు కోకోల్లుగా నమోదవుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొందరు ఉపాధ్యాయులపై రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారని పలువురు హెచ్ఎంలు వాపోతున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ అటెండన్స్ సిస్టంలో కొన్ని సాంకేతిక లోపాలు ఉండటం వల్ల వాటిని సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని అధికారులు చెబుతున్నారు. విద్యాశాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం కారణంగానూ ఈ జాప్యం జరుగుతున్నదని తెలుస్తోంది.
ఉన్నతాధికారుల నుంచి స్పష్టత కరువు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత పాటించేలా పాఠశాల విద్యాశాఖ తన పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఆగస్టు 1 నుంచి ముఖ గుర్తింపు హాజరును అమల్లోకి తీసుకొచ్చింది. విద్యాశాఖ పరిధిలోని 24,973 ప్రభుత్వ పాఠశాలల్లో దీనిని ప్రారంభించారు. అందులో 22 స్కూళ్లలో తప్ప మిగిలిన అన్నింటిలో విజయవంతంగా ఫేషియల్ రికగ్నిషన్ అటెండన్స్‌ను ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. అందులో మొత్తం ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కలిపి 1,28,760 మంది ఉన్నారు. ఫేషియల్ రికగ్నిషన్ అటెండన్స్ వ్యవస్థను సమర్థంగా అమలు చేయాలంటే ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు, నిరంతర పర్యవేక్షణ అవసరం. అయితే, ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.






