ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం..

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-17 11:56:02  IST  )

తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం..
X

ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం..

- రైతు సంక్షేమానికి కేరాఫ్‌గా తెలంగాణ

- అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసమే కులగణన

- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

దిశ, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాకు విచ్చేసిన మంత్రి కి ఇల్లందు క్రాస్ రోడ్ లో గల సింగరేణి గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐ డి ఓ సి కార్యాలయం లో జాతీయ పతాక ఆవిష్కరణ లో కార్యక్రమానికి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి జాతీయ పతాక ఆవిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ప్రజలకు తన సందేశాన్ని అందించారు.. ప్రజా పాలన దినోత్సవం తెలంగాణ చరిత్రలో గర్వకారణమైన రోజు అని, 1948 సెప్టెంబర్ 17న హైదరాబాదు సంస్థానం భారతదేశంలో కలిసిన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేస్తుందని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులు, ప్రజా పోరాట యోధుల త్యాగం వల్లే నేడు ప్రజాస్వామ్య విలువలు స్థిరపడ్డాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలకులు, ప్రజలే అధిపతులు అనే స్ఫూర్తిని ఈ రోజు అందరికీ గుర్తు చేస్తుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దార్శినిక నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.

విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, ఉపాధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ఇందిరమ్మ ప్రజా పాలనలో ప్రజల హక్కులు కాపాడబడుతున్నాయని, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా వంటి పథకాల ద్వారా రైతు సంక్షేమానికి తెలంగాణ కేరాఫ్‌గా నిలిచిందని పేర్కొన్నారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ.. సీతారామ ప్రాజెక్ట్‌తో నీటి కల నెరవేరిందని, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాపనతో జిల్లాకు ఖ్యాతి తెచ్చిందని, భద్రాచలానికి రాకపోకల సౌకర్యం కల్పించేలా రైల్వే లైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, రింగ్ రోడ్, బైపాస్ రోడ్, నేషనల్ హైవే పనులు కూడా ప్రగతిలో ఉన్నాయని వివరించారు. సింగరేణి సంస్థను బలోపేతం చేయడం, భవిష్యత్‌లో థర్మల్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం పట్ల ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

తరువాత ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి , విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భగవాన్ విరాట్ విశ్వకర్మ గారు విశ్వశిల్పి, దేవశిల్పి, ఆకాశానికి, భూమికి, దేవాలయాలకు, రథాలకు, ఆయుధాలకు రూపకర్తగా నిలిచారని వివరించారు. బీసీల కుల గణన కూడా ఈ వర్గాలకు గౌరవప్రదమైన స్థానం కల్పించడానికి చేపట్టిన ఒక చారిత్రక అడుగు అని తెలిపారు. కార్యక్రమంలో భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యా చందన, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, జిల్లా అధికారులు, ఉద్యోగులు, బీసీ సంఘం నాయకులు వెంకటాచారి , వారాధి సత్యనారాయణ , బసవపాత్రుని తిరుపతి , వారాధి రామాచారి , బి. సాంబయ్య , ఎస్. కృష్ణమాచారి , కూరపాటి లింగాచారి , పొడిచేటి వెంకటాచారి మరియు తదితరులు పాల్గొన్నారు.

Next Story