అక్షర అరాచకం: బోర్డు మార్చింది.. పేరెంట్స్‌ను ముంచింది

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-06 03:28:18  IST  )

కిస్మత్పూర్ లో అక్షర పేరుతో నడుస్తోన్న ఓ ప్రైవేట్ స్కూల్ నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

అక్షర అరాచకం: బోర్డు మార్చింది.. పేరెంట్స్‌ను ముంచింది
X

దిశ, గండిపేట : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కిస్మత్పూర్‌లో ‘అక్షర’ పేరుతో నడుస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తిస్థాయి అనుమతులు లేకపోయినా “ఇంటర్నేషనల్ స్కూల్” పేరుతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ పాఠశాలకు ఎనిమిదో తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, నిర్వాహకులు ఎలాంటి అనుమతి లేకుండానే పదో తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నియమ నిబంధనలను పట్టించుకోకుండా దర్జాగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

కేం బ్రిడ్జ్, సీబీఎస్ఈ అంటూ..

అక్షర పాఠశాలకు కేవలం స్టేట్ బోర్డు సిలబస్ బోధించేందుకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, యాజమాన్యం మాత్రం కేం బ్రిడ్జ్, సీబీఎస్ఈ సిలబస్ ఉన్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఆకర్షిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. బండ్లగూడ జాగిర్, కిస్మత్పూర్, హైదర్ షాకోట్ ప్రాంతాల్లో ఉన్న చదువుకున్న కుటుంబాలు తమ పిల్లలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్‌లో చేర్పిస్తున్నారని తెలుస్తోంది. అయితే తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

లక్షల్లో ఫీజులు..

అక్షర పాఠశాల యాజమాన్యం ఒక్కో తరగతికి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఎల్‌కేజీకి సుమారు రూ.2 లక్షలు వసూలు చేస్తుండగా, ప్రతి తరగతి పెరిగే కొద్దీ దాదాపు 10 శాతం మేర ఫీజులు పెంచుతున్నారని సమాచారం. కార్పొరేట్ స్థాయి సదుపాయాలు ఉన్నట్లు ప్రచారం చేస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాజీ మంత్రి హస్తం..

ఈ పాఠశాల వెనుక ఓ మాజీ మంత్రి అండదండలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన మద్దతుతోనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, గత నాలుగు నెలలుగా తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (టీఎస్‌ఎస్‌ఓ) ఆధ్వర్యంలో పలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడుసార్లు విద్యాశాఖ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ యాజమాన్యం స్పందించలేదని తెలుస్తోంది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమవగా తప్పని పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది. అనుమతులు లేకుండా సీబీఎస్సీ, కేం బ్రిడ్జ్, ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ పేర్లు పెట్టుకోవడంతో గత శనివారం నుంచి ఒక్కో రోజుకు పదివేల చొప్పున జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. అనంతరం 20 రోజుల తర్వాత అది ఒక్కో రోజుకు 50 వేల చొప్పున జరిమానా పెంచనున్నట్లు గండిపేట విద్యాశాఖ అధికారి నిరంజన్ తెలియజేశారు. పాఠశాలపై ఎన్నో ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

సీజ్ చెయ్యాల్సిందే..

- రమేష్, తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి

అడ్డగోలుగా నడుస్తున్న అక్షర పాఠశాలను వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఏంటి. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు..? రాజకీయ ఒత్తిడి లకు తలుగుతున్నారు. కిస్మత్పూర్ లోని అక్షర పాఠశాలను వెంటనే సీజ్ చేయాల్సిందే.

Next Story