సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌లు తీసుకురావడమే లక్ష్యం.. పనులను పరిశీలించిన సీపీ సజ్జనార్, అధికారుల బృందం

by Ramesh Naini |

బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్ 2లోని ముగ్ధ జంక్ష‌న్ వ‌ద్ద నిర్మిస్తున్న స్టీల్ ఫ్లైఓవ‌ర్ పనులను న‌గ‌ర పోలీస్ కమిషనర్ వీసీ స‌జ్జ‌నార్ క్షేత్రస్థాయిలో ప‌రిశీలించారు.

సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌లు తీసుకురావడమే లక్ష్యం.. పనులను పరిశీలించిన సీపీ సజ్జనార్, అధికారుల బృందం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భవిష్యత్తులో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపట్టిన 'హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' (హెచ్-సిటీ) ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నంబ‌ర్ 2లోని ముగ్ధ జంక్ష‌న్ వ‌ద్ద నిర్మిస్తున్న స్టీల్ ఫ్లైఓవ‌ర్ పనులను న‌గ‌ర పోలీస్ కమిషనర్ వీసీ స‌జ్జ‌నార్ శుక్ర‌వారం క్షేత్రస్థాయిలో ప‌రిశీలించారు. జీహెచ్ఎంసీ, మెఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆయన నిర్మాణ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో సజ్జనార్ మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని రహదారుల వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ రాకపోకల కోసం రాబోయే రెండేళ్లలో మొత్తం ఏడు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సమన్వయంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్మాణాలను దశలవారీగా ప్రణాళికబద్ధంగా చేప‌డుతున్న‌ట్లు వివ‌రించారు. అందులో భాగంగా శుక్రవారం రాత్రి నుంచే ముగ్ధ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ వైపు వెళ్లే మార్గంలో ఆరు పిల్లర్ల నిర్మాణ పనులకు ప్రారంభ‌మ‌వుతున్న‌ట్లు పేర్కొన్నారు.

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌ను వినియోగించాలి

పగటిపూట ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పనులను ముమ్మరంగా రాత్రివేళల్లోనే కొన‌సాగుతాయ‌ని స్పష్టం చేశారు. పునాది పనులు పూర్తయ్యే వరకు మాత్రమే రహదారిపై కొద్దిపాటి అసౌకర్యం ఉంటుందని, ఆ తర్వాత వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పూర్తయితే కేబీఆర్ పార్క్ పరిసరాలు పూర్తిగా సిగ్నల్ ఫ్రీ జంక్షన్లుగా మారుతాయని, తద్వారా నగరంలోని సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలకు సాఫీగా, వేగంగా ప్రయాణించే వీలుంటుందని వివరించారు. నిర్మాణ పనుల నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు తమ ప్రయాణ సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు. రద్దీని నివారించేందుకు వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌ను వినియోగించుకోవాల‌న్నారు. పనులు ప్రారంభమైన రెండు, మూడు రోజుల పరిస్థితులను బేరీజు వేసుకుని.. అవసరమైన మార్గాల్లో మార్పులు చేస్తూ ఎప్పటికప్పుడు తాజా ట్రాఫిక్ అడ్వైజరీలు జారీ చేస్తామని వెల్లడించారు. నగర అభివృద్ధికి ఉద్దేశించిన ఈ పనుల సమయంలో వాహనదారులు, ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ(ట్రాఫిక్) డి.జోయల్ డెవీస్, జాయింట్ సీపీ(స్పెష‌ల్ బ్రాంచ్) ఎస్ఎం విజయకుమార్, డీసీపీ (ట్రాఫిక్) కాజల్, జూబ్లీహిల్స్ డీసీపీ రమణారెడ్డి, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు మెగా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులు రాంబాబు (ఇంజినీర్), సుధాకర్ (ప్రాజెక్టు మేనేజర్) తదితరులు పాల్గొన్నారు.

Next Story