ఖాకీలపై కారం చల్లి రాళ్లతో దాడి.. చిత్తలూరు గ్రామంలో పోలీసులపై తిరగబడ్డ నిందితులు!

by Malleboina Mahesh |   (  Updated:2026-05-04 07:48:41  IST  )

నల్గొండ జిల్లా చిత్తలూరులో గోడ వివాదం చివరకు పోలీసులపై దాడికి దారితీసింది. పోలీసుల కళ్లలో కారం కొట్టి, రాళ్లతో దాడి చేయడంతో ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు.

ఖాకీలపై కారం చల్లి రాళ్లతో దాడి.. చిత్తలూరు గ్రామంలో పోలీసులపై తిరగబడ్డ నిందితులు!
X

దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం, చిత్తలూరు గ్రామం (Chittaluru village)లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోందని '100' (డైల్ 100) ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు వర్గాలను సముదాయించి, విచారణ జరుపుతున్న క్రమంలో ఒక వర్గానికి చెందిన వ్యక్తులు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుళ్లపై ఒక్కసారిగా దాడికి దిగారు. నిందితులు పోలీసుల కళ్లలో కారం కొట్టి, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో, సహచర సిబ్బంది ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నిందితుల హైడ్రామా..

పోలీసులపై దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకునే సమయంలో అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్లు తెలుస్తుంది. నిందితులు తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి, పోలీసులు తమపై 'థర్డ్ డిగ్రీ' ప్రయోగిస్తున్నారంటూ కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించారు. అయితే, విధి నిర్వహణలో ఉన్న అధికారులపైనే దాడి చేసి గాయపరచడంతో పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. పోలీసులపై దాడికి పాల్పడిన నిందితులు సురేష్, వెంకన్న, విఠల్‌లపై శాలీగౌరారం ఎస్ఐ సైదులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం, దాడులకు పాల్పడటం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, పోలీసులపై జరిగిన ఈ దాడి స్థానికంగా కలకలం రేపింది.

Next Story