- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ అందరి మద్దతుకు ధన్యవాదాలు.. దేవ్‌జీ సోదరుడి కుమార్తె తిప్పిరి సుమ భావోద్వేగ సందేశం
మావోయిస్టు టాప్ లీడర్ దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి అజ్ఞాతం వీడటంపై ఆయన సోదరుడి కుమార్తె తిప్పిరి సుమ సంతోషం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దశాబ్దాల పాటు సాగిన మావోయిస్టు సాయుధ పోరాటం చివరి అంకానికి చేరుతోంది. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టు పార్టీ టాప్ లీటర్లు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నరసింహారెడ్డి అజ్ఞత జీవితం వదిలిపెట్టారు. సుదీర్ఘ కాలం తమ కుటుంబాలను వదిలి అడవి బాట పట్టిన వీరు ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలవడం పట్ల వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దేవ్‌జీ (Devji) రాకపై ఆయన తమ్ముడి కూతురు తిప్పిరి సుమ (Thipiri Suma) కృతజ్ఞతా సందేశం పంపించారు.
నమ్మిన సిద్ధాంతం కోసమే పని చేశారు..
దేవ్‌జీ అడవులను వీడి బయటకు రావడంపై తిప్పిరి సుమ సంతోషం వ్యక్తం చేశారు. ‘పేద ప్రజలకు సేవ చేయాలన్న మా పెదనాన్న ఆశయం గొప్పది.. 40 ఏళ్లుగా కుటుంబానికి దూరమైనా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసమే పని చేశారు.. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేయాలని కోరుకున్నాం.. అనుకున్నట్లుగానే మా కోరిక ఫలించి పెదనాన్న పోలీసుల ఎదుట లొంగిపోయారు.. మా పెద్దనాన్నను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం.. ఎంతో కాలం ఎదురు చూసిన రోజు చివరికి వచ్చింది.. మా నిరీక్షణ నెరవేరింది. ఈ క్షణంలో మా హృదయాల్లో నిండిన ఆనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేము.. ఇది మా కుటుంబానికి సాధారణ రోజు కాదు.. ఇది ఒక గొప్ప భావోద్వేగ ఘట్టం.. ఒక ఆశీర్వాదం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy), డీజీపీ శివధర్‍రెడ్డికి (DGP Shivadhar Reddy) మా హృదయపూర్వక కృతజ్ఞతలు.. అలాగే ఎస్ఐబీ అధికారులు, ఈ కార్యం విజయవంతం కావడానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.. మీ అందరి కృషి, సహాయం, మద్దతు వల్లే ఈ రోజు సాధ్యమైంది.. మా కుటుంబం తరఫున ప్రతిఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.. ఇది మా జీవితాల్లో మరచిపోలేని రోజు.. మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే క్షణం.. మీ అందరికీ మా ప్రగాఢ కృతజ్ఞతలు.. మీడియా ప్రతినిధులందరికీ నా కృతజ్ఞతలు..’ అంటూ సుమ సందేశంలో పేర్కొన్నారు.
సుమ పుట్టకముందే అజ్ఞాతంలోకి..
నిజానికి తిప్పిరి సుమ జన్మించక ముందే దేవ్‌జీ ఉద్యమబాట పట్టారు. కానీ తన పెద్దనాన్న ఉద్యమంలో ఉన్నారని తెలుకున్న సుమ ఆయన తిరిగి ఇంటిరి రావాలని చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్లు జరిగిన ప్రతిసారి తన పెద్దనాన్నకు ఆందోళనతో కూడిన విజ్ఞప్తిని చేస్తూ వచ్చారు. ఆపరేషన్ కగార్‌లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు స్థానాన్ని దేవ్‌జీతో భర్తీ చేయబోతున్నారన్న ప్రచారం జరిగిన సమయంలో తిప్పిరి సుమ తన పెద్దనాన్నకు లేఖ రాశారు. ‘పెదనాన్నా ఇంటికి రా... ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఎన్‌కౌంటర్లు జరుగుతున్నయ్.. నువ్వెట్లున్నవో.. నీకేం అవుతుందోనని భయమేస్తోంది. సమసమాజం కోసం అడవులకు వెళ్లావు.. ఇక చాలు.. ఇంటికి వచ్చేయ్..’ అంటూ గతేడాది మేలో లేఖ రాశారు. రెండు నెలల క్రితం దేవ్‌జీ పోలీసుల కస్టడీలో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ‘మా పెద్దనాన్న ఆచూకీ తెలపాలి’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు సుమ ట్వీట్ ద్వారా కోరారు. ప్రతి రోజు వినిపించే ఈ సమాచారం తమ కుటుంబాన్ని తీవ్ర కలిచివేతకు గురిచేస్తోందని, దయచేసి ఆయనకు లొంగిపోవడానికి అవకాశం ఇవ్వాలని తమ కుటుంబం తరఫున వేడుకుంటున్నామని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. మొత్తానికి దేవ్‌జీ అజ్ఞాతం వీడి బయటకు రావడంతో ఆయన కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






