- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో ‘దళపతి’ జైత్రయాత్ర.. ఆధిక్యంలో సెంచరీ మార్క్ దాటేసిన విజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే సునామీ అధికారం డీఎంకేతో పాటు ఏఐడీఎంకేలను ముంచేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో సంచనాలు నమోదు అవుతున్నాయి. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ, నటుడు దళపతి విజయ్ (Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) సంచలన రీతిలో దూసుకుపోతోంది. ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం టీవీకే ఏకంగా 104 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ సెంచరీ మార్క్‌ను దాటేసింది.
బోసిపోయిన డీఎంకే కార్యాలయం..
మరోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న అధికార డీఎంకే (DMK)కు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రస్తుతం డీఎంకే కేవలం 51 స్థానాలకే పరిమితం కాగా, ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకే (AIADMK) 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఫలితాల సరళి చూసి దిగ్భ్రాంతికి గురైన డీఎంకే కార్యకర్తలు సంబురాల కోసం వేసిన టెంట్లను పీకేశారు. డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’ జనాలు లేక బోసిపోయింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయం వద్దే బోరున విలపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
విస్మయంలో ఏఐడీఎంకే.. సంబరాల్లో విజయ్ ఫ్యాన్స్
మరోవైపు, ఏఐడీఎంకే నేతలు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కాక విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పార్టీ ఈ స్థాయిలో ప్రభావం చూపుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ, దళపతి విజయ్ అభిమానులు మాత్రం ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి బాణాసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు మొదలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత, తటస్థ ఓటర్లు విజయ్ నినాదమైన మార్పునకు జై కొట్టినట్లుగా స్పష్టమవుతోంది. ముఖ్యంగా యువ ఓటర్ల గంపగుత్త మద్దతే విజయ్ని సెంచరీ దిశగా నడిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే తమిళనాడులో విజయ్ అధికారాన్ని చేజిక్కించుకునే చాన్స్ ఉంది.






