ప్రజాపాలన సంబరాలు బహిష్కరిస్తాం! ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ హెచ్చరిక

by Ramesh Naini |

ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) ప్రధాన కార్యదర్శి కొమిరెల్లి రాజిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

ప్రజాపాలన సంబరాలు బహిష్కరిస్తాం! ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) ప్రధాన కార్యదర్శి కొమిరెల్లి రాజిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ప్రజాపాలన సంబరాల కంటే ముందే ఆర్టీసీ యూనియన్లను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎం కార్యాలయంలో ఆయన ఓ వినతిపత్రం అందించారు. యూనియన్లు పునరుద్ధరణకు హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఒక్క రూపాయి వ్యయం లేని ఈ వాగ్దానం అమలు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికుల విలీన ప్రక్రియ పూర్తి చేయడం, పెండింగ్ బకాయిల చెల్లింపు, రాబోయే పీఆర్‌సీలో టీఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగులను చేర్చడం వంటి హామీలను కాంగ్రెస్ ఇచ్చినట్టు గుర్తుచేశారు.

కాంగ్రెస్ పార్టీ గెలుపునకు తమ యూనియన్ తరపున తమ కుటుంబాలతో కలిసి విశేష కృషి చేసినప్పటికీ ప్రభుత్వం కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం చూపుతోందని రాజిరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఉద్యోగ సంఘాల సబ్ కమిటీ సభ్యులను కలిసి తరచూ వినతి పత్రాలు ఇచ్చినా పురోగతి కనిపించడం లేదని వాపోయారు. ముఖ్యమంత్రిని మూడు సార్లు కలిసినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన సమావేశంలో సీఎం స్వయంగా యూనియన్ల పునరుద్ధరణకు హామీ ఇచ్చిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. డిసెంబర్ 9 లోపు యూనియన్ల పునరుద్ధరణ చేపట్టకపోతే ప్రజాపాలన సంబరాలను బహిష్కరిస్తామని, నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని రాజిరెడ్డి హెచ్చరించారు.

Next Story