- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగాది, రంజాన్ రద్దీకి సిద్ధమైన టీజీఎస్ఆర్టీసీ.. ప్రత్యేక బస్సులు, 50% అదనపు ఛార్జీలు!

దిశ, తెలంగాణ బ్యూరో: ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈ పండుగ సెలవులకు ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. అలాగే ఈ నెల 23వ తేదీ తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది. ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా నడిపే స్పెషల్ సర్వీసులకు ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంది. స్పెషల్ బస్సుల్లో 1.5 రెట్లు (50 శాతం అదనపు ఛార్జీలు) వరకు టికెట్ ధరలను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే..
తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే ఈ పెంచిన చార్జీలు వర్తిస్తాయి. ఈ నెల 17, 18 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 23 తేదీల్లో మాత్రమే పెంచిన ఛార్జీలు అమల్లో ఉంటాయి. సాధారణంగా పండుగల సమయంలో ఒకవైపు రద్దీ ఎక్కువగా ఉండి, మరోవైపు బస్సులు ఖాళీగా రావాల్సి ఉంటుంది కాబట్టి, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆర్టీసీ ఈ 1.5 రెట్ల నిబంధనను అమలు చేస్తుందని అధికారులు తెలిపారు. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే అమల్లో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉగాది, రంజాన్ పండుగ రోజుల్లో నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం రాష్ట్రంలో యథావిధిగా అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.






