జనవరి 20న మరో పోరాటానికి సిద్ధమైన టీజీఎస్ఆర్టీసీ.. కార్మికులకు జేఏసీ పిలుపు

by Ramesh Naini |

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎన్.కమలాకర్ రెడ్డి, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, బి.యాదగిరి అన్నారు.

జనవరి 20న మరో పోరాటానికి సిద్ధమైన టీజీఎస్ఆర్టీసీ.. కార్మికులకు జేఏసీ పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎన్.కమలాకర్ రెడ్డి, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, బి.యాదగిరి అన్నారు. మంగళవారం ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో జేఏసీ అత్యవసర సమావేశం జరిగింది. గత ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తోందని, ఎన్ని సార్లు ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి నప్పటికీ పరిష్కరింపచేయటంలో తగిన శ్రద్ధ చూపకపోవడంతోనే తాము పోరాటాలు చేయాల్సి వస్తోందని జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి గత ఏడాది మేడే సందర్భంగా స్పందించి ఆర్టీసీ కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నామని బహిరంగంగా ప్రకటించి 7 నెలలు కావస్తున్నా ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించలేదని విమర్శించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసనగా మరో పోరాటానికి జేఏసీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. అందులో భాగంగా మంగళవారం నుంచి 19వ తేదీ వరకు పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జనవరి 20న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు అందరూ ఎర్ర బ్యాడ్జీలు (రిబ్బన్లు) ధరించి పోరాట దినం పాటించాలని పిలుపునిచ్చారు. జేఏసీ చేపట్టిన ఈ ఉద్యమ కార్యాచరణను కార్మిక వర్గమంతా ఐక్యంగా విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జె.రాఘవులు, కె.రామిరెడ్డి (ఈయూ), కోశాధికారి బి.యాదయ్య, సి.సత్తయ్య, ఎం.హెచ్.ఆలీ, బుద్ధ విశాల్, జి.రాములు (బీకేయూ), రాంచందర్, బి. శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story