విప్లవాత్మక మార్పుకు టీజీఎస్ఆర్టీసీ శ్రీకారం.. రెట్రో ఫిట్ మెంట్ విధానంలో బస్సుల్లో మార్పులు

by Naga Rani Yarlagadda |

పొగలు కక్కుతూ పరిగెత్తే బస్సులకు కాలం చెల్లిందని పక్కన పెట్టాల్సిన అవసరం లేదన్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. రెట్రో ఫిట్ మెంట్ విధానంలో పాతబస్సులకు కొత్త మెరుగులు దిద్దుతున్నట్లు తెలిపారు.

విప్లవాత్మక మార్పుకు టీజీఎస్ఆర్టీసీ శ్రీకారం.. రెట్రో ఫిట్ మెంట్ విధానంలో బస్సుల్లో మార్పులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : భాగ్యనగరం రోడ్లపై పొగలు కక్కుతూ పరుగెత్తే పాత ఆర్టీసీ బస్సులకు ఇక కాలం చెల్లినట్లయింది. గడువు ముగిసిందని వాటిని తుక్కు కింద పక్కన పడేయాల్సిన పనిలేదు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా టీజీఎస్ఆర్టీసీ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. పాత బస్సుల బాడీని అలాగే ఉంచి.. కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్ ఇంజిన్ల స్థానంలో అత్యాధునిక బ్యాటరీలను బిగించి వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చబోతున్నది. ‘రెట్రో ఫిట్‌మెంట్’ పేరుతో పిలిచే ఈ సాంకేతికతతో హైదరాబాద్ ప్రజారవాణా వ్యవస్థలో సరికొత్త హరితశకం ఆరంభం కానుంది. ఉప్పల్ డిపోలో చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో ఇప్పుడు ఏకంగా 240 బస్సులను విద్యుత్ వాహనాలుగా మార్చేందుకు ఆర్టీసీ టెండర్లను ఖరారు చేసింది.

ఆర్టీసీలో నూతన శకం

హైదరాబాద్‌ నగరవాసులను అనారోగ్యానికి గురిచేస్తున్న వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని ఆర్టీసీ నిర్ణయించింది. 2023లోనే ముషీరాబాద్ డిపోకు చెందిన ఒక డీజిల్ బస్సును ప్రైవేట్ సంస్థ సహకారంతో ఎలక్ట్రిక్ బస్సుగా మార్చారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు విజయవంతమైంది. ప్రస్తుతం ఈ బస్సు ఉప్పల్ డిపో పరిధిలో మూడేళ్లుగా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా రెట్రో ఫిట్‌మెంట్ టెక్నాలజీతో పాత బస్సులను విద్యుత్ వాహనాలుగా మార్చే ప్రక్రియకు శుక్రవారం బస్‌భవన్‌లో అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఆర్టీసీ వీసీ, ఎండీ వై.నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో.. టెండర్లు దక్కించుకున్న సంస్థలకు బస్సుల మార్పిడి బాధ్యతలను అప్పగించారు. సాయిగ్రీన్ మొబిలిటీ సంస్థకు 200, కల్యాణి పవర్ ట్రైన్ లిమిటెడ్‌కు 40 బస్సులను ఎలక్ట్రిక్‌గా మార్చే పనిని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నగరంలో ఆరు డిపోల పరిధిలో 325 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ ఏడాదిలో కొత్తగా మరో 175 బస్సులు రోడ్డెక్కనున్నాయి. వీటికి తోడు రెట్రో ఫిట్‌మెంట్ బస్సులు రానుండటంతో చార్జింగ్ సదుపాయాల కోసం రూ.392 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశారు. కొత్తగా 10 డిపోలు, 10 చార్జింగ్ కేంద్రాలను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఈడీలు మునిశేఖర్, వెంకన్న, రాజశేఖర్, విజయపుష్పతో పాటు కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

పొల్యూషన్ ఫ్రీ హైదరాబాద్

2027 నాటికి హైదరాబాద్‌ ఓఆర్ఆర్ పరిధిలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలన్నదే సంస్థ లక్ష్యం. ఇప్పటికే ముషీరాబాద్ డిపోలో ప్రయోగాత్మకంగా ఒక బస్సును ఎలక్ట్రిక్‌గా మార్చి ఉప్పల్ రూట్‌లో నడుపుతున్నాం. ఆ ప్రయోగం విజయవంతమైంది. ఈ విధానంతో బస్సుల జీవితకాలం పెరగడంతో పాటు ప్రజలకు కాలుష్యరహిత ప్రయాణం అందుబాటులోకి రానుంది దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కారణంగా అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు మనకూ రాకూడదు. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా కాలుష్యాన్ని పెద్దఎత్తున అరికట్టేందుకు అవకాశం లభించనుంది. హైదరాబాద్ భవిష్యత్ కోసం తీసుకొస్తున్న ఈ హరిత ప్రయాణాన్ని ప్రజలు ఆదరించాలి. నగర ప్రజారవాణా రూపురేఖలను మార్చే ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.

- వై.నాగిరెడ్డి, ఎండీ, టీజీఎస్ఆర్టీసీ

Next Story