- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంక్రాంతి వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో సేవలను అందిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో సేవలను అందిస్తోంది. పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లే ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ముందస్తు తగిన ఏర్పాట్లతో వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఈ నెల 9 నుంచి ప్రత్యేక బస్సులతో ఆయా ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాన్ని అందిస్తున్న టీజీఎస్ఆర్టీసీ జనవరి 13 వరకు 5375 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేసింది. ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా ఉండేందుకు ముందస్తుగా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి బస్సుల రాకపోకలకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంస్థ అధికారులు కూడా ఆయా పాయింట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ రవాణా ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సిబ్బందికి తగు ఆదేశాలు ఇస్తున్నారు. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది
తిరుగు ప్రయాణం ప్రయాణికుల కోసం..
కాగా, ఈ నెల 9 వ తేదీన 721, 10 వ తారీఖున 1645, 11న 1180, 12న 1109, 13న (6 గంటల వరకు) 720 ప్రత్యేక బస్సులలో ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు సంస్థ వెల్లడించింది. ప్రధానంగా జేబీఎస్ (1484), ఎంజీబీఎస్ (1170), ఉప్పల్(807), కేపీహెచ్‌బీ (916), ఎల్‌బీనగర్ (715), ఆరాంఘర్ (283) నుంచి స్పెషల్ బస్సలను నడిపినట్లు తెలిపింది. అలాగే, సంక్రాంతి పండుగ అనంతరం తిరుగు ప్రయాణంలో కూడా ప్రయాణికులకు ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ నెల 18, 19 న ప్రత్యేక బస్సుల్ని నడుపనున్నట్లు గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ప్రత్యేకమైన రవాణా సేవల కోసం సిబ్బంది అంకితభావంతో విధుల్ని నిర్వహిస్తున్నారని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది.
ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన సమాచారాన్ని అందించడం జరుగుతోందని, సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుని టీజీఎస్ ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000,040-23450033లలో సంప్రదించాలని సూచించింది.






