జూలై 11న మింట్ కాంపౌండ్‌లో టీజీఎస్పీడీసీఎల్ “సురక్ష 2026”

by Naga Rani Yarlagadda |

విద్యుత్ సిబ్బంది, వినియోగదారులు, ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ టీజీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది.

జూలై 11న మింట్ కాంపౌండ్‌లో టీజీఎస్పీడీసీఎల్ “సురక్ష 2026”
X
  • విద్యుత్ రంగంలో ప్రమాదాల నివారణే లక్ష్యంగా సేఫ్టీ ఎక్స్‌పో అండ్ వర్క్‌షాప్
  • ఆధునిక భద్రతా పరికరాల ప్రదర్శనకు వేదిక

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ సిబ్బంది, వినియోగదారులు, ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ టీజీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదరహిత విద్యుత్ సేవల లక్ష్యంగా ఈ నెల 11న హైదరాబాద్‌ మింట్ కాంపౌండ్‌లోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో “సురక్ష 2026 – టీజీఎస్పీడీసీఎల్ సేఫ్టీ ఎక్స్‌పో అండ్ వర్క్‌షాప్”ను నిర్వహించనుంది. జూలై 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పో ద్వారా విద్యుత్ రంగంలో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయనున్నారు. క్షేత్రస్థాయి సిబ్బందిలో భద్రతా సంస్కృతిని పెంపొందించడం, ఆధునిక పరికరాలు, సాంకేతికతలపై అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రదర్శనలో వ్యక్తిగత భద్రతా పరికరాలు (పీపీఈ), ఇన్సులేటెడ్ టూల్స్, ఎర్తింగ్ పరికరాలు, ఎత్తైన ప్రదేశాల్లో పనిచేసే వారి కోసం ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ టెస్టింగ్ పరికరాలు, అగ్నిమాపక భద్రతా ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. దీనితో పాటు ప్రమాదాల నివారణ, ఆధునిక భద్రతా విధానాలపై నిపుణులతో సాంకేతిక సదస్సులు, అవగాహన కార్యక్రమాలు కూడా ఉంటాయి. “సురక్షిత ఉద్యోగి, సురక్షిత విద్యుత్ వ్యవస్థ, సురక్షిత సమాజం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సీఎండీ పేర్కొన్నారు. అయితే ఈ వర్క్‌షాప్ పూర్తిగా భద్రతా పరికరాల ప్రదర్శనకే పరిమితమని, విద్యుత్ పంపిణీ, లోడ్ మేనేజ్‌మెంట్ లాంటి ఇతర సాంకేతిక ఉత్పత్తులకు భవిష్యత్తులో వేరే కార్యక్రమం నిర్వహిస్తామని సంస్థ స్పష్టం చేసింది.

Next Story