టీజీఐసెట్, టీజీఎడ్ సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీఐసెట్ 2026) షెడ్యూల్ విడుదలైంది.

టీజీఐసెట్, టీజీఎడ్ సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీఐసెట్ 2026) షెడ్యూల్ విడుదలైంది. బుధవారం టీజీసీహెచ్‌ఈ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పరీక్షా తేదీలను ఖరారు చేశారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి సెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ అలువాల రవి తెలిపారు. ఈ పరీక్షల నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 6న విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 12 నుండి మార్చి 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఐసెట్ పరీక్ష మే 13, 14 తేదీలలో ప్రతిరోజూ రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 550, ఇతర అభ్యర్థులకు రూ. 750 ఫీజు ఉంటుందని తెలిపారు.

మే 12న టీజీఎడ్‌సెట్-2026 ప్రవేశ పరీక్ష

రాష్ట్రంలోని బిఈడీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టిజి ఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ షెడ్యూల్‌ను అధికారులు బుధవారం విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల కమిటీ మొదటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షల నోటిఫికేషన్ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఫిబ్రవరి 23 నుండి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం కానుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 12 న సీబీటీ పద్ధతిలో రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిస్టా రెడ్డి, కాకతీయ వర్సిటీ విసి ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి, ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి. వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండేళ్ల బీఈడి కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కన్వీనర్ కోరారు.

Next Story