TG HRC: యూసుఫ్‌గూడలో పారిశుద్ధ్య కార్మికుడి మృతి.. హెచ్‌ఆర్‌సీ సీరియస్

by Ramesh Naini |

యూసుఫ్‌గూడలోని గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ర్యాంప్/కంపాక్టర్ యంత్రంలో పడి పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) తీవ్రంగా స్పందించింది.

TG HRC: యూసుఫ్‌గూడలో పారిశుద్ధ్య కార్మికుడి మృతి.. హెచ్‌ఆర్‌సీ సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూసుఫ్‌గూడలోని గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ర్యాంప్/కంపాక్టర్ యంత్రంలో పడి పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (Telangana State Human Rights Commission) తీవ్రంగా స్పందించింది. ఆదివారం ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా కమిషన్ చైర్మన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ ఈ వ్యవహారాన్ని సుమోటో (Suo-motu) కేసుగా స్వీకరించారు. కార్మికుడి మృతికి సరైన భద్రతా చర్యలు లేకపోవడం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని కమిషన్ ప్రాథమికంగా అభిప్రాయపడింది. పని ప్రదేశంలో కనీస రక్షణ కల్పించకపోవడం అనేది కార్మికుల 'జీవించే హక్కు' (Right to Life), 'మానవ గౌరవం' (Human Dignity), 'సురక్షిత పని పరిస్థితుల' ఉల్లంఘన కిందకు వస్తుందని కమిషన్ పేర్కొంది.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు నోటీసులు

ఘటన తీవ్రత దృష్ట్యా, ఈ అంశాన్ని విచారణకు స్వీకరించిన కమిషన్.. తక్షణమే దీనిపై స్పందించాలని అధికారులను ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపి, వాస్తవాలతో కూడిన సమగ్ర నివేదికను 2026, ఫిబ్రవరి 23వ తేదీ లోపు తమకు సమర్పించాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్‌ను ఆదేశించింది.

Next Story