TG Gurukulam: గురుకుల కళాశాలల్లో ‘ఎంట్రెన్స్’రద్దు.. నేరుగా ఇంటర్, డిగ్రీ అడ్మిషన్స్​

by Kema Shiva Kumar |   (  Updated:2025-02-14 02:34:15  IST  )

ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో నేరుగా ఇంటర్, డిగ్రీ అడ్మిషన్స్​తీసుకోనున్నారు.

TG Gurukulam: గురుకుల కళాశాలల్లో ‘ఎంట్రెన్స్’రద్దు.. నేరుగా ఇంటర్, డిగ్రీ అడ్మిషన్స్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని గురుకులాల్లో నేరుగా ఇంటర్, డిగ్రీ అడ్మిషన్స్​తీసుకోనున్నారు. గతంలో ఎంట్రెన్స్ నిర్వహించి ప్రవేశాలు నిర్వహించే వారు. కానీ ఏటా 30శాతం మేర సీట్లు మిగిలిపోతున్నాయని సీఎం దృష్టికి అధికార యంత్రాంగం తీసుకువచ్చింది. అలాగే, ఎంట్రెన్స్​లో సీట్లు రాకపోవడంతో కార్పొరేట్​ విద్యా సంస్థలలో వేల రూపాయలను విద్యార్థులు వెచ్చించాల్సి వస్తోంది. ఈ విషయం కూడా సీఎం దృష్టికి రాగా ఇకపై ఎంట్రెన్స్​ లేకుండానే అడ్మిషన్స్​ తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో 2025-26 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు ఇక నేరుగా జరగనున్నాయి.

వాస్తవానికి గురుకులాల్లోనే పదో తరగతి చదివిన స్టూడెంట్స్​, ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు తాము చదివిన గురుకులాల్లో ఎంట్రెన్స్​ సీట్లు పొందలేని పరిస్థితి నెలకొంది. దీంతో దాదాపు 30 శాతం సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గురుకులాలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ వీఎస్ అలుగు వర్షిణి ఈ విషయం సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మిగతా గురుకులాలకు చెందిన కార్యదర్శులు సైతం ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతోనే ఇకపై ఎంట్రెన్స్ లేకుండానే అడ్మిషన్స్​ కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మొత్తంగా అన్ని గురుకులాలకు కలిపి రాష్ట్రంలో 81 డిగ్రీ కళాశాలలు ఉండగా ఈ కాలేజీల్లో చదివే స్టూడెంట్స్​కి ఐటీ సంబంధిత కోర్సులు, కోడింగ్ క్లాసులు, వృత్తి విద్యాకోర్సుల్లో కూడా ట్రైనింగ్​ ఇస్తున్నారు.

Next Story