TG Govt: ‘రెవెన్యూ’ పదాలతో వచ్చిన తంటా.. పట్టాదారుల పరేషాన్!

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-21 01:55:42  IST  )

భూ వివరాలు తప్పుగా నమోదైతే భూభారతి అమలులోకి వచ్చిన ఏప్రిల్ 14 నుంచి ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.

TG Govt: ‘రెవెన్యూ’ పదాలతో వచ్చిన తంటా.. పట్టాదారుల పరేషాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ వివరాలు తప్పుగా నమోదైతే భూభారతి అమలులోకి వచ్చిన ఏప్రిల్ 14 నుంచి ఏడాదిలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, లిమిటేషన్ పేరుతో దరఖాస్తు తిరస్కరించే అవకాశం సైతం ఉన్నదంటూ చర్చ జరుగుతున్నది. అయితే ఇది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దశాబ్దాలుగా పట్టాగా ఉన్నా భూమిని ధరణిలో ప్రభుత్వానిధిగా పేర్కొని నిషేధిత జాబితాలో చేర్చారు. రైతు తప్పు లేకపోయినా.. వారిని సంవత్సరాల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్నారు. సుప్రీం, హైకోర్టు తీర్పులను సరిగా స్టడీ చేయకుండా ఖాస్రా, సేత్వార్‌ను ప్రామాణికంగా తీసుకున్నారు. ఖారిజ్ ఖాతా వంటి పదాలకు అర్థాలు, వాటి ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారు. అది పన్ను కట్టని ఏడాది మాత్రమే పహానీలో నమోదు చేసే పదమని, ఆ తర్వాత చెల్లిస్తే పట్టాగా రాస్తారని చెప్పినా నెగిటివ్ రిపోర్టులు రాశారు. నాలుగైదు సార్లు అప్లయ్ చేసినా.. తిరస్కరించిన తహసీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు ఉన్నారు. కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో నాలుగైదు సార్లు రిజెక్ట్ చేసిన పీవోబీ దరఖాస్తులు ఉన్నాయి. అయితే ఇలా రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టిన తహసీల్దార్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించాలని ధరణి పోర్టల్ బాధితులు కోరుతున్నారు.

పట్టా భూములైతే..

రాష్ట్ర వ్యాప్తంగా పట్టా భూములను సర్కారీగా మార్చిన అంశంలోనే లక్షలాది ఎకరాలు నిషేధిత జాబితాలో ఇరుక్కుపోయాయి. పీవోబీ నుంచి తొలగించాలంటూ వచ్చే దరఖాస్తుల సంఖ్య లక్షల్లోనే ఉన్నది. అయితే ఈ విషయంలోనే కలెక్టర్ల మీద దుమారం రేగుతున్నది. ఆధారాలు చూపినా.. సమయానికి అన్ లాక్ చేయకుండా దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారు. మరోవైపు తహసీల్దార్లకు కూడా రిపోర్టు ఏ విధంగా రూపొందించాలో అర్థం కావడం లేదు. ఏదైనా పట్టా భూమిని రైతుకు అనుకూలంగా రాస్తే కలెక్టర్లు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడుతున్నారు. 50 ఏండ్లకు పైగా పట్టాగా రికార్డులో నమోదైన అంశాన్ని రాయకుండా, ఖాస్రా పహానీలో సర్కారీ అని ఉందంటూ తేల్చేస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని తహసీల్దారే సర్కారీ అంటూ రాసినప్పుడు తానెలా రిలీజ్ చేయగలనంటూ కలెక్టర్లు పేచీ పెడుతున్నారు. ఈ గందరగోళ వాతావరణానికి తెర తీసేందుకు గైడ్ లైన్స్ రూపకల్పన అనివార్యమని భూ చట్టాల నిపుణులు సూచిస్తున్నారు.

ధరణి రికార్డుకు ప్రామాణికం సేత్వారా?

ఆర్వోఆర్ చట్టం 1971 ప్రకారం రికార్డ్ ఆఫ్ రైట్స్ ను ప్రిపేర్ చేశారు. అలాంటప్పుడు సేత్వార్ ను ప్రామాణికంగా తీసుకొని పీవోబీలో నమోదు చేయాలని ఆదేశించిన సదరు చీఫ్ సెక్రెటరీ వైఖరి వల్ల ఎన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్నారో రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు చేయాలి.

మిగతా పహానీలు చూడరా?

సేత్వార్, ఖాస్రా పహాణీ ప్రకారం ధరణి డేటాను అప్ లోడ్ చేయడం వల్లే తలెత్తిన సమస్య ఇది. ఖాస్రా పహానీకి ఉన్న చట్టబద్ధత ప్రకారం వాటిని ప్రభుత్వ భూములుగా పరిగణించొద్దు. దాని ప్రకారమే పీవోబీ జాబితాలో పెట్టారు. కానీ పలు కేసుల్లో సుప్రీం కోర్టు, హైకోర్టులు ఖాస్రా, సేత్వార్ లతో పాటు మిగతా పహానీలను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తీర్పులు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయని భూ చట్టాల నిపుణులు చెబుతున్నారు.

రికార్డులు మార్చిన అధికారులపై చర్యలేవి?

ఐదారు దశాబ్దాలుగా ఖారీజ్ ఖాతా భూములను చెక్ చేయకుండా పహానీల్లో పట్టా అని రాసిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోకుండా.. స్టాంపు డ్యూటీ కట్టి కొనుగోలు చేసి, పన్నులు కట్టి పాసు పుస్తకాలు పొందిన రైతులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఖాస్రా, సేత్వార్ లకు భిన్నంగా లెక్కలేనన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు స్టాంప్ డ్యూటీ ఎందుకు కట్టించుకున్నారో అధికారులే చెప్పాలి. తమను ఇబ్బందులకు గురి చేసే బదులు 1954 నుంచి రికార్డులను మార్చిన వేలాది మంది రెవెన్యూ అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు చేసిన వారిని కూడా రిమూవ్ చేయాలని, ఖారిజ్ ఖాతాను పట్టాగా మార్చిన వీఆర్వో, గిర్దావర్, తహసీల్దార్, ఆర్డీవోలపై యాక్షన్ తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పహానీలు చూసి పట్టా భూములను కొనుగోలు చేస్తే.. ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటూ రైతులను ఇబ్బంది పెడుతున్న వారికీ నోటీసులు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఖాస్రా, సేత్వార్ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదైనప్పటికీ.. ఆ తర్వాత పట్టాగా మార్చిన అప్పటి అధికారులు, సిబ్బందిపై ఒక్కరిపై చర్యలు లేవు. సేత్వార్ ప్రకారమే చూసి రిజిస్ట్రేషన్లు నిలిపివేయకుండా పట్టా అని పహానీలు చూసి సేల్ డీడ్స్ చేసిన సబ్ రిజిస్ట్రార్లు, మ్యుటేషన్ చేసిన తహశీల్దార్లు, పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసిన ఆర్డీవోలపై చర్యలు తీసుకోవాలి. ఆరేడు దశాబ్దాలుగా పట్టాగా మార్చి.. పలు లావాదేవీలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడేమో సేత్వార్ ప్రకారమంటూ ప్రభుత్వానిదిగా పీవోబీలో నమోదు చేస్తే .. కొనుగోలు చేసిన రైతులకు ఈ అధికారుల నుంచి సమాధానం చెప్పించాలి.

తప్పెవరిది?

* రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం మండలం రాందాసుపల్లి సర్వే నం.41/20ఆ1/2లో అల్మాస్ గూడకు చెందిన ఏనుగు లక్ష్మారెడ్డి 15 గుంటల భూమిని 2019లో స్టాంపు డ్యూటీ చెల్లించి సేల్ డీడ్ చేయించుకున్నారు. అయితే కొనుగోలుకు ముందే 1954 నుంచి పహానీలను పరిశీలిస్తే ఆ సర్వే నంబరులోని భూమి పట్టాగానే ఉన్నది. ధరణి రికార్డుల్లోకి కూడా ఎక్కింది. కానీ ఇప్పుడు అది ఖాస్రాలో ప్రభుత్వం ఉందంటూ పీవోబీలో నమోదు చేశారు. మూడు సార్లు అప్లయ్ చేస్తే తహసీల్దార్ ఉన్నది ఉన్నట్లుగా రాసి రిపోర్ట్ పంపిస్తే అదనపు కలెక్టర్, కలెక్టర్ రిజెక్ట్ చేస్తున్నారు. అంటే 70 ఏండ్లు పహానీల్లో పట్టాగా ఉందని కొనుగోలు చేస్తే ఇప్పుడు శిక్షిస్తే ఎట్లా? ఇన్నాండ్లుగా ఎన్నో క్రయ విక్రయాలు జరిగాయి. ఇప్పుడు మరోసారి అప్లయ్ చేస్తే.. తాను వాస్తవాలను రిపోర్టులో పేర్కొంటున్నానని, ఉన్నతాధికారులు రిజెక్ట్ చేస్తే తానేం చేయాలంటూ చేతులెత్తేస్తున్నారు. ఇప్పుడైనా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Next Story