- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Govt.: విద్యార్థులకు తీపి కబురు.. పంపిణీకి పాఠ్య పుస్తకాలు రెడీ
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి పంపిణీ చేయాల్సిన పాఠ్య పుస్తకాలను ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. కొత్త పాఠ్య పుస్తకాలకు సంబంధించిన డ్రాప్టుపై అభిప్రాయాలను తెలియజేయాలని ఉపాధ్యాయులను ఎస్ఈఆర్టీ అధికారులు కోరుతున్నారు. ప్రస్తుతం తయారైన పుస్తకాల్లో పెద్దగా మార్పులేవీ లేనప్పటికీ .. విద్యార్థుల కోసం అవసరమైన మార్పులు-చేర్పులు చేయాలని సూచిస్తున్నారు.
పుస్తకాల కవర్ పేజీల్లో క్యూఆర్ కోడ్
ఈసారి పుస్తకాల కవర్ పేజీల్లో క్యూఆర్ కోడ్, తెలంగాణ రాష్ట్ర గీతం, డయల్ 100 వంటి వాటిని పొందుపరుస్తున్నారు. ఇవి తప్ప.. పుస్తకాల్లో పెద్దగా మార్పులేవీ చేయడం లేదు. సిలబస్‌లోనూ పెద్దగా మార్పులేవీ లేకుండానే.. యథావిధిగా పుస్తకాలను ప్రింట్ చేస్తున్నారు. ఈ సారి పుస్తకాల తయారీకి సాంకేతిక పద్ధతులను వినియోగించుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా పాఠ్య పుస్తకాలను నేరుగా డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హార్డ్ కాపీలు అందకున్నా.. క్యూఆర్ కోడ్ ద్వారా సాఫ్ట్ కాపీలను అందించేందుకు విద్యా శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రొజెక్టర్, మెుబైల్, టీవీల్లో పుస్తకాలను ప్రదర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అక్కడక్కడా చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఇది డ్రాప్టు మాత్రమే కావడంతో.. విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి వాటిని సరిదిద్దే అవకాశం ఉంది.
గతంలోనే అభిప్రాయ సేకరణ
పాఠ్య పుస్తకాల తయారీపై గతంలోనే టీచర్ల అభిప్రాయాలను ఎస్ఈఆర్టీ కోరింది. టీచర్లు ఇచ్చిన సూచనల మేరకు ప్రస్తుతం పాఠ్యపుస్తకాలను తయారు చేస్తున్నారు. పుస్తకాల డ్రాప్టు కాపీలు తయారీ అవుతున్న నేపథ్యంలో.. ఇంకేమైనా మోజార్టీ సూచనలు వస్తే వాటిని పరిగణలోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం వెబ్‌సైట్ ద్వారా సమాచారాన్ని ఇవ్వాలని టీచర్లను కోరుతున్నారు.
గుణపాఠాలు నేర్చుకుని విద్యా శాఖ
గత విద్యా సంవత్సంలో తప్పిదాలు జరిగినప్పటికీ..విద్యాశాఖ పెద్దగా పాఠాలు నేర్చుకోలేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. గత విద్యా సంవత్సరం ప్రారంభంలో కొన్ని పుస్తకాలపై ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్ పేరును అలాగే కొనసాగించారు. ప్రభుత్వం మారినా..సీఎం పేరు మారకపోవడంతో.. ఉపాధ్యాయులు ఆ పేజీలను చించివేశారు. అప్పట్లో దీనిపై తెలంగాణ అంతా తీవ్ర దుమారం రేగింది. తెలుగు పుస్తకాల్లో సంపాదకుల పేర్లలో దేశపతి శ్రీనివాస్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ముఖ్యమంత్రి కార్యాలయం అని ఉంది. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. సీఎంకు ఆయన ఓఎస్డీగా పనిచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయి 14 నెలలు అవుతున్నా ఆయన హోదాను పాఠశాల విద్యాశాఖ అధికారులు మాత్రం పుస్తకాల్లో కొనసాగించారు. ప్రస్తుతం ముందుమాటలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి పేరు కానీ, విద్యాశాఖ అధికారుల పేరుగాని ఎక్కడా ప్రస్తావించలేదు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని విద్యా శాఖాధికారులకు ..పలువురు సూచిస్తున్నారు. ఇదిఇలా ఉంటే.. మూడో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో మాత్రం రాష్ట్రానికి మొదటి సీఎం, రాష్ట్ర గుర్తులు, తదితర మౌలిక అంశాలను యథావిధిగా కొనసాగించారు.






