TG Govt.: అన్నదాతలకు తీపికబురు.. రూ.348 కోట్లు కేటాయింపు

by Kema Shiva Kumar |

రైతులకు అధిక ధరలను అందించి, ఆయిల్‌​ఫామ్​‌ సాగును లాభసాటి చేసేందుకు కొత్త రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

TG Govt.: అన్నదాతలకు తీపికబురు.. రూ.348 కోట్లు కేటాయింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు అధిక ధరలను అందించి, ఆయిల్‌​ఫామ్​‌ సాగును లాభసాటి చేసేందుకు కొత్త రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2024–25 సంవత్సరానికి లక్ష ఎకరాలలో సాగు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకోసం రూ.348 కోట్లు కేటాయించింది. కాంగ్రెస్ ​అధికారం చేపట్టిన తర్వాత 11,685 మంది రైతులు 39,258 ఎకరాల్లో ఆయిల్‌​ఫామ్​‌ సాగు చేశారు. టార్గెట్‌ ​పూర్తి చేసేందుకు ఉద్యానవన శాఖ రైతుల్లో అవగాహన కల్పించేందుకు విన్నూత కార్యక్రమాలు చేపట్టేందుకు నడుం బిగిస్తోంది. ఆయిల్‌ఫామ్‌ ​పంట అనగానే తెలంగాణ గుర్తుకు వచ్చేలా చేసేందుకు ప్లాన్‌ ​చేస్తోంది. దేశ వ్యాప్తంగా సాగు అవుతున్న గణాంకాల్లో తెలుగు రాష్ట్రాలు ముందు వరుసలో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్​ జిల్లాలో 2.58 లక్షల ఎకరాల సాగుకు అనుకూలమైనది గుర్తించింది. ఈ జిల్లాల్లో టీజీ ఆయిల్‌​ఫెడ్​ సంస్థ ఆయిల్​‌ఫామ్​‌ విస్తరణకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి టన్ను గెల ధర రూ.12,534 ఉండగా, ప్రస్తుతం రూ.21 వేలకు చేరుకుంది. భవిష్యత్తులో మరింత పెరిగే చాన్స్ ఉందని ఉద్యాన శాఖ అంచనా వేస్తోంది.

సాగు విస్తరణకు 14 కంపెనీలకు అనుమతులు

ప్రస్తుతం భారతదేశంలో ఆయిల్‌​ఫామ్​11.75 లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ.. ఏడాదికి 3.96 లక్షల మెట్రిక్​‌ టన్నుల ముడి ఫామాయిల్ ​ఉత్పత్తి జరుగుతోంది. జాతీయ ఫామాయిల్‌ ​డిమాండ్ ​100 లక్షల మెట్రిక్​‌ టన్నులు ఉంది. ఫామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే దేశంలో సుమారు 70 లక్షల ఎకరాలు సాగు చేయాల్సిన అవసరం ఉంది. దేశీయ ఫామాయిల్​ ఉత్పత్తిలో 98 శాతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రం నుంచి జరుగుతోంది. నూనె గింజల పంటలో కెళ్ల పామాయిల్​ ఎక్కువ దిగుబడినిస్తూ 25 నుంచి 30 ఏండ్ల వరకు ఏడాదికి సుమారు రూ. 1,20,000 వరకు ఆదాయం పొందొచ్చు. ప్రభుత్వం 31 జిల్లాల్లో సాగు విస్తరణ చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. మొక్కలు పెంచడం కోసం ఇప్పటివరకు కంపెనీలకు రాష్ట్ర వ్యాప్తంగా 44 నర్సరీలు ఏర్పాటు చేశాయి. ఆయిల్​‌ఫామ్​‌ సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎకరానికి రూ.50,918 వరకు రాయితీ ఇస్తుంది. మొక్కలు, డ్రిప్‌ ​ఇరిగేషన్​, మొదటి నాలుగేండ్లపాటు తోటల యాజమాన్యం అంతర పంటల సాగు కోసం రాయితీ వర్తిస్తుంది.

33 ఏండ్లలో 2.42 లక్షల ఎకరాలు

రాష్ర్టంలో 1992 నుంచి ఇప్పటివరకు 2.42 లక్ష ఎకరాలను 64,325 మంది సాగు చేయగా, ఇందులో 1,96,302 ఎకరాలు 55,997 మంది రైతులు 2021–22 నుంచి నేటి వరకు సాగులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లాలో, ఆయిల్​‌ఫెడ్‌ ​రెండు ప్రొసెసింగ్​‌ మిల్లులు నిర్వహణ చేస్తోంది. వీటి సామర్థ్యం గంటకు 120 మెట్రిక్‌ ​టన్నులు. కాగా, ఫ్యాక్టరీ జోన్​లను కేటాయించిన మిగతా కంపెనీలు కూడా మిల్లులను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు సర్కారు మొదలుపెట్టింది.

ఎక్కువ సాగు చేసిన జిల్లాలు

ఆయిల్‌ఫామ్‌ ​సాగులో భద్రాద్రి కొత్తగూడెం 75,870 ఎకరాలు, ఖమ్మం 35,926 ఎకరాలు, సిద్దిపేట 12,321 ఎకరాలు, నల్లగొండ 10,857, నిర్మల్​ 8,184, మహబూబాబాద్ ​7,487, జనగాం 6,931, నాగర్‌​కర్నూల్ ​6,763, గద్వాల్​ 6,508, నారాయణపేట 6,241 ఎకరాలు ఉండగా, అతి తక్కువగా సంగారెడ్డి 401 ఎకరాలు, కొమురంభీం ఆసిఫాబాద్ ​312, వికారాబాద్ ​314, మెదక్ ​229 ఎకరాల్లో సాగవుతోంది.

Next Story