రెండో విడత ఇందిరమ్మ ఇండ్లపై సర్కార్ ఫోకస్.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-16 01:54:42  IST  )

పేదోళ్ల సొంతింటి కలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

రెండో విడత ఇందిరమ్మ ఇండ్లపై సర్కార్ ఫోకస్.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేదోళ్ల సొంతింటి కలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే మొదటి విడత ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా, పలువురు లబ్ధిదారులకు బిల్లులకు సంబంధించిన చెక్కులు సైతం అందజేశారు. అదే ఊపుతో రెండో విడతకు సర్కారు శ్రీకారం చుట్టింది. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లబ్ధిదారులను ఎంపిక చేసి రెండో విడత హౌసెస్ నిర్మాణాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేసి ఇండ్ల నిర్మాణాలు జరిగేలా చూడాలని ఆదేశించారు.

మూడు విడతలుగా లబ్ధిదారులు

డిసెంబరు 2023లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం గ్రామీణ ప్రాంతాలు, జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని గృహ నిర్మాణ శాఖ అధికారులు మూడు విభాగాలుగా విభజించారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 26న ఈ పథకాన్ని ప్రారంభించగా.. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. మొత్తంగా మొదటి విడతలో 562 గ్రామాల నుంచి 70,122 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే రోజున వారందరికీ మంజూరు పత్రాలను అందజేశారు. వీరిలో ఎల్-1, ఎల్-2, ఎల్-3 విభాగాల కింద ఎంపిక చేశారు. ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని ఎల్-1 జాబితాలో చేర్చారు. ఖాళీ జాగాతో పాటు గుడిసె, మట్టిమిద్దెలు, రేకుల షెడ్లు ఉన్న వారిని కూడా ఇదే లిస్టులో చేర్చారు. సొంత స్థలం లేని వారిని ఎల్-2లో పొందుపర్చారు. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్‌-3 జాబితాలో చేర్చారు.

నియోజకవర్గానికి ఓ స్పెషల్ ఆఫీసర్

వచ్చిన అప్లికేషన్లలో నుంచి రెండో విడత కోసం లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 23 రోజుల కార్యాచరణను సిద్ధం చేశారు. రెండు రోజుల క్రితం కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలోనూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని, మండలంలోని నాలుగైదు గ్రామాలకు ఒక గెజిటెడ్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని సూచించారు. ఒకవేళ జాబితాలో అనర్హులు ఉంటే గ్రామ పంచాయతీ, మండల గెజిటెడ్ ఆఫీసర్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చివరి విచారణలో అనర్హులు ఉన్నట్లు తేలితే.. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ నెల 15 నుంచి 17 వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులతో అధికారులు సంప్రదించాలని సూచించారు. 18 నుంచి 21 వరకు లబ్ధిదారుల జాబితాను ఆఫీసర్లు పరిశీలించాల్సి ఉంది. 22 నుంచి 30 తేదీ వరకు జిల్లా అధికారులు సూపర్ చెక్ చేయాల్సి ఉంది. మే 1న పంచాయతీ ఆఫీసుల్లో అర్హుల జాబితాను ప్రదర్శించాలని ఆదేశించారు. మే 2 నుంచి 4వ తేదీ వరకూ కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రూటినీ చేయనున్నారు. మే 5 నుంచి 7వ తేదీ వరకూ జిల్లా కలెక్టర్లు ఇండ్లను మంజూరు చేస్తారు.

ఇన్‌చార్జి మంత్రి ఖరారు చేశాకే లిస్ట్ ఫైనల్

జిల్లా కలెక్టర్లు ఫైనల్ చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదించాల్సి ఉంది. ఈ మేరకు లిస్టును మంత్రి ఖరారు చేశాకే ఫైనల్ చేయాలని ఇటీవల సమావేశంలో సీఎం ఆదేశించారు. గ్రామ కమిటీలు ఆమోదించిన లబ్ధిదారుల జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించి జిల్లా ఇన్‌చార్జి మంత్రికి పంపించాలన్నారు. ఇందిరమ్మ కమిటీలు, కలెక్టర్లు, ఇన్‌చార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ప్రత్యేక అధికారి ఉంటారని తెలిపారు. ఎల్-2 పరిధిలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూంలను అందించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సొంత స్థలం లేని వారికి డైరెక్టుగా డబుల్ బెడ్ రూంలను అందించనున్నారు. 2013-14 నుంచి 2024 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,61,325 ‘డబుల్’ ఇండ్ల నిర్మాణాలు పూర్తయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఎక్కడైనా అసంపూర్తిగా ఉండిపోయిన ఇండ్లు ఉంటే వాటిని లబ్ధిదారులే పూర్తిచేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

లబ్ధిదారుల ఖాతాల్లో ‘బేస్‌మెంట్’ డబ్బులు జమ: పొంగులేటి

బేస్‌మెంట్ స్థాయిలో పూర్తి చేసుకున్న ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్ధిదారుల‌కు రూ.20.19 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల‌లో జ‌మ‌ చేసినట్టు హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి తెలిపారు. మొద‌టి విడ‌త‌లో పైల‌ట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన 70,122 ఇండ్లలో బేస్‌మెంట్ పూర్తిచేసుకున్న 2,019 మందికి రూ.ల‌క్ష చొప్పున రూ.20.19 కోట్లను రిలీజ్ చేశామ‌ని మంగళవారం ఓ ప్రక‌ట‌న‌లో తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి 12 మంది ల‌బ్ధిదారుల‌కు లాంఛ‌నంగా రూ.లక్ష చొప్పున చెక్కుల‌ను అంద‌జేశారని వెల్లడించారు. బేస్‌మెంట్ పూర్తయిన త‌ర్వాత రూ.ల‌క్ష, గోడ‌లు పూర్తయితే రూ.1.25 ల‌క్షలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న త‌ర్వాత రూ.1.75 ల‌క్షలు, ఇల్లు కంప్లీటయిన త‌ర్వాత మిగిలిన రూ.ల‌క్ష రిలీజ్ చేస్తామ‌ని వివ‌రించారు. క‌నీసం 400 ఎస్ఎఫ్‌టీకి త‌గ్గకుండా 600 ఎస్‌ఎఫ్‌టీకి మించ‌కుండా లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాల‌ని సూచించారు.

Next Story