- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Govt.: పథకాలకే ఫస్ట్ ప్రియారిటీ.. ఈ నెలలోనే ఆ రెండు స్కీమ్‌లు అమలు

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ముందుగా పథకాలకు ప్రయారిటీ ఇస్తున్నది. ఈ నెలలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించబోతున్నది. దీంతో ఖర్చులన్నింటినీ తగ్గించుకొని స్కీమ్‌లకే ప్రయారిటీ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ నెల 26న ఈ రెండు పథకాలు అమలుకానున్న నేపథ్యంలో.. వీటికి దాదాపు రూ.10 వేల కోట్లు అవసరం ఉన్నాయి. దీంతో మిగతా ఖర్చులను పక్కన పెట్టి, వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం అవసరమైన ఫండ్స్‌ను ప్రభుత్వం రెడీ చేస్తున్నది. ఇందులో భాగంగా.. ఈ నెలలో బిల్లుల చెల్లింపులు ఉండవని పెద్ద కాంట్రాక్టర్లకు సంకేతాలు పంపినట్లు తెలుస్తున్నది. ఇదే విషయంపై రూలింగ్ పార్టీ లీడర్లకు సైతం చెప్పినట్లు సమాచారం. వచ్చే నెల వరకు ఎవరూ బిల్లుల కోసం ఒత్తిడి చేయొద్దని క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే.. కొందరు లీడర్లు అదే పనిగా టోకెన్స్ పట్టుకుని ప్రభుత్వంలోని కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే, సదరు లీడర్లుకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.
పథకాల కోసం ఫండ్స్ రెడీ
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు కోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం ఇప్పటి రెడీ చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ పథకాల అమలుకు దాదాపు రూ 9,100 కోట్ల నుంచి 9,500 కోట్లు అవసరం పడుతాయని అంచనా వేశారు. అయితే.. స్కీమ్స్ అమలు సమయంలో లబ్ధిదారుల సంఖ్య పెరిగే చాన్స్ ఉండొచ్చనే అంచనాతో ప్రభుత్వం ముందస్తుగా దాదాపు రూ.10 వేల కోట్లను రెడీ చేసిపెట్టుకున్నట్లు తెలిసింది. దీంతో పెద్ద కాంట్రాక్టర్లకు ఈ నెలలో బిల్లుల చెల్లింపు చేయడం సాధ్యం కాదని క్లారిటీగా చెప్పినట్లు తెలిసింది. ఈ మధ్య కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వంలోని కీలక నేత వద్దకు వస్తే, ఇదే విషయాన్ని వారికి వివరించి వెనక్కి పంపినట్లు సమాచారం. ముందుగా ప్రభుత్వ పథకాలను అమలు చేసిన తరువాత, నిధుల సౌలభ్యం మేరకు బిల్లుల చెల్లింపుల అంశాన్ని పరిశీలిస్తామని చెప్పినట్లు తెలిసింది.
1.40 కోటి ఎకరాలు.. రూ.8,500 కోట్ల వ్యయం
ఈ నెల 26న రైతు భరోసా స్కీమ్ కింద ఒక్కో ఎకరానికి రూ.6 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయనున్నది. కేవలం సాగుకు యోగ్యమైన భూములకే పంట సాయం చేయనున్నారు. కొన్ని రోజులుగా అటు రెవెన్యూ, ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లు సంయుక్తంగా సాగు భూముల వివరాలను తీశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.40 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అందుకోసం దాదాపు రూ.8,500 కోట్లు వ్యయం అవుతుందని లెక్కలు వేశారు. అయితే.. ఫీల్డ్ లెవల్‌లో రీ వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అప్పుడు సాగు భూముల లెక్కల్లో అటు ఇటుగా తేడా వచ్చే చాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని ఆఫీసర్లు అంచనా చెబుతున్నారు.
రైతు కూలీలు 11 లక్షలు.. రూ.600 కోట్ల ఖర్చు
రాష్ట్రంలో భూమి లేని రైతు కూలీలు 11 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం తీసిన లెక్కలో తేలింది. వీరందరికీ ఈ నెల 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద ఈ సీజన్ కోసం రూ.6 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. అందుకోసం రూ.600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే.. రాష్ట్రంలో 55 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉండగా, అందులో 29 లక్షల మంది కూలీలు ఏడాదిలో 10 రోజులపాటు పనులకు వెళ్లినట్లు గుర్తించారు. అందులో భూమి లేని కూలీల ఫ్యామిలీలు 11 లక్షల మంది మాత్రమే ఉన్నారని నిర్ధారణకు వచ్చినట్లు సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.