TG Govt.: మహానగర అభివృద్ధిపై సర్కార్ ఫోకస్.. హెచ్ఎండీఏ విస్తరణకు మాస్టర్ ప్లాన్

by Kema Shiva Kumar |

హైదరాబాద్ మహా నగరాన్ని మరింతగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నది.

TG Govt.: మహానగర అభివృద్ధిపై సర్కార్ ఫోకస్.. హెచ్ఎండీఏ విస్తరణకు మాస్టర్ ప్లాన్
X

హైదరాబాద్ మహా నగరాన్ని మరింతగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్‌ ప్లాన్-2050కు హెచ్‌ఎండీఏ కసరత్తు షురూ చేసింది. రాబోయే మూడు నాలుగు నెలల్లో డ్రాఫ్ట్ విడుదల చేస్తార‌ని, తర్వాత ఆయా జిల్లాలు, మండల స్థాయి నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారని తెలిసింది. ఈ ప్రక్రియ మొత్తం సుమారు మూడు నుంచి నాలుగు నెలల పాటు జరగనున్నది. అయితే ప్రస్తుత హెచ్ఎండీఏ ప్రణాళిక -2030లో ఏడు జిల్లాలే ఉండగా కొత్త మాస్టర్ ప్లాన్‌ను ప్రాంతీయ రింగ్ రోడ్డును దాటి విస్తరించనున్నారు. ఈ క్రమంలో కొత్తగా నాలుగు జిల్లాలు, 32 మండలాలు హెచ్‌ఎండీఏలో చేరనున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: హెచ్ఎండీఏ ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌-2025లో మార్పులు, చేర్పుల గురించి పరిశీలించిన తర్వాత.. పూర్తి స్థాయి మాస్టర్‌ ప్లాన్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. 2025 చివరి నుంచి కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చే అవకాశముందని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఐదు మాస్టర్‌ ప్లాన్స్

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐదు మాస్టర్‌ ప్లాన్‌లు అమల్లో ఉన్నాయి. పాత మున్సిపాలిటీ, జీహెచ్‌ఎంసీ, ఎయిర్‌ పోర్టు అథారిటీ, సైబరాబాద్‌ డెవలప్‌మెంట్ అథారిటీ, విస్తరిత ప్రాంతాల అభివృద్ధి ప్లాన్ -2023 ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్కోసారి ఒక ప్రాంతం రెండు మాస్టర్ ప్లాన్‌లో పరిధిలోకి వస్తుండడంతో రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 2030 మాస్టర్‌ ప్లాన్‌లో తప్పుల కారణంగా చాలా ప్రాంతాల్లో అభివృద్ధి అనుకున్నంత మేర సాగడం లేదు. ఎన్‌వోసీల కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. గూగుల్‌ మ్యాపులు, స్థానిక రెవెన్యూ మ్యాపులు, గ్రామాల మ్యాపులు, ఎన్‌జీఆర్‌ఐ, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ను తీసుకొని కొత్త సాంకేతిక విధానంతో తప్పులకు ఆస్కారం లేకుండా కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఇక నుంచి ఒకటే మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా ఆయా స్థానిక సంస్థలు, ఇతర అథారిటీలు తమ ప్రణాళికలకు రూపకల్పన చేయనున్నాయి.

2050 వరకు ప్లాన్

హెచ్ఎండీఏ విస్తరిత ప్రాంతాల్లో 2050 వరకు ఎలాంటి సౌకర్యాలు కావాలి? రహదారుల అనుసంధానం, రెసిడెన్షియల్ జోన్లు, పారిశ్రామిక జోన్లు, అర్బన్, గ్రీన్ జోన్లు, గ్రిడ్ రోడ్లు ఎక్కడెక్కడ‌ ఎంతెంత ఉండాలన్న అంశాలను పొందుప‌రుస్తారు. 2008లో ఏడు జిల్లాల పరిధిలో మహానగర విస్తరిత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని 2030 అవసరాల కోసం మాస్టర్‌ ప్లాన్‌ను హెచ్‌ఎండీఏ రూపకల్పన చేసింది. అప్పట్లో క్షేత్ర స్థాయి పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోలేదని, అందుకే అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే హెచ్ఎండీఏ అభివృద్ధికి ఆటంకంగా మారుతుందనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ కొత్త మాస్టర్ ప్లాన్‌లో అన్ని రకాల జోన్లను పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు జోన్లను పదికిపైగా పెంచడంతో పాటు అదనపు సిబ్బందిని నియ‌మిస్తార‌ని స‌మాచారం.

రింగ్ రోడ్డు దాటి..

ప్రస్తుత హెచ్ఎండీఏ ప్రణాళిక -2030లో ఏడు జిల్లాలే ఉన్నాయి. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రాంతీయ రింగు రోడ్డు దాటి విస్తరించనున్నారు. కొత్తగా నాలుగు జిల్లాలు, 32 మండలాలు హెచ్‌ఎండీఏలో చేరనున్నాయి. హైదరాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేటతో పాటు కొత్తగా నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ మండలాలను చేర్చనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం 74 మండలాలు ఉండగా వాటి సంఖ్య వంద దాటొచ్చని అంచనా. ప్రస్తుతం 7,257 చదరవు కిలోమీటర్ల కంటే విస్తీర్ణం ఉండగా ఇది దాదాపు 13 వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించే అవ‌కాశ‌ముందని తెలిసింది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 3,600 చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా బ్లూ అండ్‌ గ్రీన్‌ పేరుతో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తారు.

Next Story