TG Govt.: రిటైర్డ్ ఆఫీసర్లకు నో ఎక్స్‌టెన్షన్..! సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు

by Kema Shiva Kumar |

రిటైర్డ్ ఆఫీసర్లకు మరోసారి ఎక్స్‌టెన్షన్ ఇవ్వకూడదని సీఎం రేవంత్ నిర్ణయించినట్టు తెలిసింది.

TG Govt.: రిటైర్డ్ ఆఫీసర్లకు నో ఎక్స్‌టెన్షన్..! సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రిటైర్డ్ ఆఫీసర్లకు మరోసారి ఎక్స్‌టెన్షన్ ఇవ్వకూడదని సీఎం రేవంత్ నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో మార్చి 31 తర్వాత అన్ని డిపార్ట్‌మెంట్‌లలో పనిచేస్తున్న వెయ్యి మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఇంటిదారి పట్టనున్నారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసినట్టు టాక్. ఈ మేరకు అన్ని శాఖల సెక్రెటరీలు,హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో రిటైర్డ్ ఆఫీసర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. ఆ శాఖలో అవసరం ఉన్నా, లేకున్నా తమకు సన్నిహితులనే కారణంతో వారిని అపాయింట్ చేశారనే విమర్శలున్నాయి. అందులో మెజార్టీ ఆఫీసర్ల కాంట్రాక్టు కాలం మార్చి 31తో ముగుస్తుండగా.. వారికి మళ్లీ ఎక్స్‌టెన్షన్ ఇవ్వొద్దని సీఎం రేవంత్ ఆదేశించినట్టు టాక్.

బీఆర్ఎస్‌కు సన్నిహిత ఆఫీసర్లు..

కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చాక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న రిటైర్ట్ అధికారుల లిస్టుపై ఆరా తీసింది. వివిధ శాఖల్లో మొత్తం 1,048 మంది ఆఫీసర్లు ఉన్నట్టు జీఏడీ గుర్తించింది. ఇందులో కొందరి కాంట్రాక్టు కాలం ఇప్పటికే ముగియగా, దాదాపు 1000 మంది ఆఫీసర్ల టెన్యూర్ ఈ మార్చి 31తో ముగియనుంది. వీరంతా బీఆర్ఎస్ లీడర్లకు సన్నిహితంగా ఉండటం, తమ శాఖ పరిధిలో జరిగే అంతర్గత విషయాలను సదరు నేతలకు చేరవేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇన్ఫర్మేషన్ లీక్ చేసే ఆఫీసర్లను గుర్తించి ఇప్పటికే కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా, వారిలో మార్పు రాలేదు. దీంతో కాంట్రాక్టు కాలం ముగిసిన వెంటనే వారిని ఇంటికి పంపాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు టాక్. ఒకవేళ ఏదైనా శాఖలో రిటైర్ట్ ఆఫీసర్ల సేవలు అవసరం ఉంటే, అప్పుడు ఎవరిని తీసుకోవాలి? ఏ విధంగా తీసుకోవాలి? అని ఆలోచించి నిర్ణయం తీసుకుందామని సీఎం అభిప్రాయపడినట్టు సెక్రెటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

సీఎం శాఖల్లోనే ఎక్కువ మంది..

సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న మున్సిపల్ శాఖలోనే ఎక్కువ మంది రిటైర్డ్ అధికారులు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నట్టు తెలిసింది. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ కమిషనరేట్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీ ఆఫీసుల్లో సుమారు 200 మంది రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నట్టు టాక్. వీరిలో మెజార్టీ ఆఫీసర్లు పలు కీలక బాధ్యతల్లో ఉన్నారని సమాచారం. వీరు ఇటీవల మున్సిపల్ శాఖలోని కొన్ని అంతర్గత విషయాలను బీఆర్ఎస్ లీడర్లకు చేరవేసినట్టు నిఘా వర్గాలు గుర్తించి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. అలాగే, సివిల్ సప్లయ్ కమిషనరేట్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్స్‌లో సైతం పెద్ద ఎత్తున రిటైర్ట్ ఆఫీసర్లు ఉన్నట్టు సమాచారం.

అసెంబ్లీలో కీలక పోస్టుల్లోనూ వారే..

అసెంబ్లీలో పలు కీలక విభాగాల్లో రిటైర్ట్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. గత ఆరున్నరేండ్లుగా రిటైర్డ్ సెక్రెటరీ పర్యవేక్షణలోనే అసెంబ్లీ కార్యకలాపాలు కొనసాగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదవీ విరమణ చేసిన ఇద్దరు, ముగ్గురు డిప్యూటీ సెక్రెటరీలను ఓఎస్డీ పేరుతో అపాయింట్ చేసుకున్నారు. అత్యంత ముఖ్యమైన లైబ్రరీ సైతం రిటైర్డ్ ఆఫీసర్ పర్యవేక్షణలోనే పనిచేస్తున్నది. అసెంబ్లీలో సుమారు 15 మంది రిటైర్డ్ ఆఫీసర్లు పనిచేస్తున్నట్టు సమాచారం.

కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు ఎందుకు?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సుమారు 55 వేల మంది ఉద్యోగాలను భర్తీ చేసింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వీరికి జీతాలు ఇస్తున్నది. ఆ పోస్టుల్లోనే దాదాపు 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు సైతం పనిచేస్తున్నట్టు టాక్. రెగ్యూలర్ ఉద్యోగులను భర్తీ చేశాక మళ్లీ కాంట్రాక్టు ఉద్యోగులను కొనసాగించడం అవసరమా? అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తున్నది. ఇందులో కొందరు హెచ్ఓడీలు ప్రభుత్వానికి తెలియకుండా కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ను కొనసాగిస్తున్నట్టు టాక్. కాగా, కొత్తగా అపాయింట్ అయిన పోస్టుల్లో మళ్లీ కాంట్రాక్టు పద్ధతిన ఎంప్లాయీస్‌ను రిక్రూట్ చేసుకోవద్దని, ఈ మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది.

Next Story