TG Govt.: సర్పంచ్ ఎన్నికలకు మోగనున్న నగారా..! ముహూర్తం ఫిక్స్?

by Kema Shiva Kumar |

స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది.

TG Govt.: సర్పంచ్ ఎన్నికలకు మోగనున్న నగారా..! ముహూర్తం ఫిక్స్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్నది. వచ్చేనెల నిర్వహిస్తారా? లేదంటే ఎండాకాలం ముగిసే సమయంలో నిర్వహిస్తారా? అనే చర్చ గ్రామాల్లో మొదలు రాష్ట్రస్థాయి వరకు జరుగుతున్నది. ఇప్పటికే దాదాపు ఏడాదిగా గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. ఏడు నెలల క్రితమే ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల పదవీకాలం పూర్తికావడంతో ఆ పనులు సైతం స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలోనే ఉన్నాయి. దీనికి తోడు రేపటి నుంచి మున్సిపాలిటీలు సైతం స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్లనున్నాయి. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొన్నది.

రెండు, మూడు రోజుల్లో క్లారిటీ..

గతంలో పలుమార్లు లోకల్ బాడీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహించారు. కానీ, ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచినట్టు ప్రచారం జరుగుతున్నది. ఏ చిన్న విషయం సైతం బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడినట్టు టాక్. ఫారిన్ టూర్ ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన ఆయన.. రెండు, మూడు రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నదని సెక్రెటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సీఎం నిర్ణయం ఎలా ఉంటుందోనని అటు అధికారులు ఇటు మంత్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేసి ఎన్నికల సంఘానికి సమర్పిస్తే వచ్చే నెలలో ‌గానీ, లేదంటే మే చివరన.. లేదా జూన్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

పథకాలు కలిసివస్తాయనే టాక్..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు రైతుభరోసా, ఆత్మీయభరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ఈ నెల 26న ప్రారంభించనున్నారు. వీటి అమలు సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించనున్నారు. దీంతో ఊరూరా పండగ వాతావరణం నెలకొంటుందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైతుభరోసా కోసం రూ.8,500 కోట్లు, ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం 3 లక్షల మందికి కొత్తగా రేషన్‌ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతి గ్రామంలోనూ మొదటి విడతలో కనీసం 10 మందికి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇంతటి పాజిటివ్ టైమ్ ఉన్నప్పుడు వచ్చే నెలలో పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని టాక్.

ఇప్పుడు కుదరకపోతే మే తర్వాతే?

ఒకవేళ ఎన్నికలు వచ్చేనెలలో నిర్వహించకపోతే మే చివర్లో లేదంటే జూన్‌లో నిర్వహిస్తారనే ప్రచారం ఉంది. ఎందుకంటే మార్చి మూడో వారంలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆ తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్.. అనంతరం పాఠశాల విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఆ టైంలో ఎన్నికల నిర్వహణ కష్టతరంగా మారనుంది. అవన్నీ ముగిశాక ఏప్రిల్ చివరలో ఎన్నికలు నిర్వహిస్తే ఎండకాలం ఎఫెక్ట్ ఫలితాలపై ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినా తాగునీటి కొరత, కరెంట్ కోతలు సహజంగా తలెత్తుతాయి. అందుకే మే చివరన లేదా జూన్‌లో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుదనే చర్చ మొదలైంది.

రిజర్వేషన్ల ఖరారుకు 3, ఎన్నికల నిర్వహణకు మరో 3 వారాలు

ఎన్నికల నిర్వహిణకు ముందుగా బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేయాలి. ఆ బాధ్యతలు చూసే డెడికేషన్ కమిషన్‌కు బీసీ కులగణన రిపోర్టును అందించాలి. ఇప్పటివరకు కులగణన రిపోర్టు కమిషన్‌కు అందించారా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు. ఒకవేళ ఇప్పటికే బీసీ కులగణన లెక్కలు డెడికేషన్ కమిషన్‌కు సమర్పించి ఉంటే రిజర్వేషన్లను ఫైనల్ చేసేందుకు 3 నుంచి 4 వారాల టైం పడుతుంది. రిజ్వర్వేషన్లు ఫైనల్ అయ్యాక షెడ్యూల్ ఇచ్చి, ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్‌కు మరో 3 వారాల సమయం అవసరం పడుతుంది.

రేపటి నుంచి ‘మున్సిపల్‌’లో స్పెషల్ ఆఫీసర్ల పాలన

రాష్ట్రంలో 130 అర్బన్ లోకల్ బాడీస్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. అక్కడ స్పెషల్ ఆఫీసర్లను నియామకానికి మున్సిపల్ శాఖ ఇప్పటికే ఫైల్ సిద్ధం చేసింది. ఎక్కడ ఏ ఆఫీసర్‌ను నియమించాలనే అంశంపైనా కసరత్తు పూర్తి చేసింది. సీఎం రేవంత్ ఆమోదం పొందిన వెంటనే జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. చిన్న మున్సిపాలిటీలకు ఆర్డీవో స్థాయి అధికారి, పెద్ద మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు అడిషనల్ కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించే అవకాశముంది. ఒకవేళ అధికారులు సరిపోకపోతే వివిధ విభాగాల్లో హెచ్‌ఓడీలుగా పనిచేస్తున్న అధికారులను సైతం ప్రత్యేక అధికారులుగా నియమించే చాన్స్ ఉన్నది.

Next Story