- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt.: రాష్ట్రంలో జోరుగా గ్రామ సభలు.. కొత్త రేషన్ కార్డులకు కదలివచ్చిన జనం
ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం గ్రామ, వార్డు సభలు జరిగాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం గ్రామ, వార్డు సభలు జరిగాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి నాలుగు పథకాలకు అధికారులు దరఖాస్తులను స్వీకరించి గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేపట్టారు. దరఖాస్తుల స్వీకరణ కోసం ఈ నెల 24వ తేదీ వరకు గ్రామ సభలు, వార్డు సభలు కొనసాగనున్నాయి. గ్రామసభల్లో నాలుగు పథకాలు ఎందుకు చేపడుతుందో వివరాలను ప్రజలకు తెలిపి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. గ్రామ సభల్లో ఎక్కువగా రేషన్ కార్డులకు సంబంధించినవే వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న 4 పథకాలకు గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న సభల్లో ప్రజలు, అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నది.
లబ్ధిదారుల ఎంపిక విషయంలో పలువురు అభ్యంతరం చెప్తున్నారు. అర్హులైన కొందరు తమ ఆస్తులు, ఆదాయ వివరాలు చూడాలని ఇతరులు చెప్పిన తప్పుడు సమాచారం అధికారులు పరిగణనలోకి తీసుకోవద్దని సూచించారు. కొన్నిచోట్ల రాజకీయ నాయకుల జోక్యం పెరగడంతో నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది. రైతు భరోసా,ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో పెద్దగా తలనొప్పులు లేకున్నా, రేషన్ కార్డుల ఎంపిక, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో గందరగోళం జరుగుతోంది. లబ్ధిదారుల ఎంపిక ఆఫీసర్లకు సవాల్‌గా మారింది. పాత కార్డులు యథావిధిగా కొనసాగిస్తామని, కొత్తగా లబ్ధిదారుల విషయంలో చిక్కు ముడులు వస్తున్నాయని అంటున్నారు. పిల్లలకు ఫీజు స్కాలర్షిప్, ఆరోగ్య శ్రీ వంటి పలు పథకాలకు రేషన్‌కార్డు ప్రామాణికంగా తీసుకోవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ కార్డుల కోసం ఎగబడుతున్నారు.
గ్రామ సభల్లో కొత్త ‘రేషన్’ దరఖాస్తుల స్వీకరణ
ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ఇప్పటికే 11,65,052 మందికి సంబంధించిన 6,68,309 కార్డుల సమాచారం ఈ నెల 12న కలెక్టర్లకు పంపింది. అక్రమంగా కలిగిన ఉన్న మరో 1.36 కోట్ల మందికి సంబంధించిన 41.25 లక్షల కార్డుల సమాచారం అవసరాన్ని బట్టి తెలియజేస్తామని పేర్కొంది. ఇవే కాకుండా గ్రామసభలో కార్డుల కోసం కొత్త దరఖాస్తులు తీసుకోవాలని సూచించింది. కుటుంబ పెద్ద, ఇతర సభ్యుల ఆదార్ కార్డులు, చిరునామా, సెల్ నంబర్, కులానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలని చెప్పింది.
గాదేపల్లిలో గ్రామ సభ బహిష్కరణ
నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని గాదేపల్లి గ్రామ ప్రజలు గ్రామసభను స్థానికులు బహిష్కరించారు. ఉదయం సభ ప్రారంభంకాగా ప్రభుత్వ అధికారులు వివిధ పథకాలకు లబ్ధిదారుల వివరాలను వెల్లడించారు. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదన్నారు. ఈ జాబితా తమకు ఆమోదయోగ్యంగా లేదని సభను బహిష్కరించి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు సభల నిర్వహణ కనిపించడం లేదు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం వార్డు సభలు మొదలు కాలేదు. లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారుల సర్వే ఇంకా పూర్తి చేయలేదు. గ్రేటర్ సర్వే పూర్తయ్యాక ఫిబ్రవరి 1 నుంచి వార్డు సభలకు పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.






