TG Govt.: ధరణితో పుట్టెడు భూ సమస్యలు.. 35 మాడ్యూల్స్‌తో నో యూజ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-01 01:52:02  IST  )

రాష్ట్రంలో ధరణి పోర్టల్ సృష్టించిన గందరగోళం అంతా ఇంతా కాదు.

TG Govt.: ధరణితో పుట్టెడు భూ సమస్యలు.. 35 మాడ్యూల్స్‌తో నో యూజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ధరణి పోర్టల్ సృష్టించిన గందరగోళం అంతా ఇంతా కాదు. ఐదేండ్లయినా.. 35 మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చినా భూ సమస్యలు తీరలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. భూభారతి చట్టం అమల్లోకి రాగానే 4 మండలాల్లో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైంది. భూ సమస్యల అధ్యయనానికి క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను గుర్తిస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, నారాయణపేట జిల్లా మద్దూరు, ములుగు జిల్లా వెంకటాపురం మండలాల్లోని ప్రతీ గ్రామంలో రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఐతే అనూహ్య రీతిలో అప్లికేషన్లు వచ్చాయి. లీఫ్స్ రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు నమునాను అమలు చేశారు.

ఇందులో లిఖితపూర్వకంగానే దరఖాస్తులను స్వీకరించారు. భూమి సమస్యలను క్లుప్తంగా తెలుసుకునేందుకు 13 అంశాలను చేర్చారు. ఈ సరికొత్త అప్లికేషన్ ఫారం రైతులకు సులువుగా అర్థమైంది. దాంతో వారే సొంతంగా రాసి రెవెన్యూ సిబ్బందికి అందించారు. ఆన్‌లైన్, భూ భారతి, మీ సేవా కేంద్రం.. అంటే సొంతంగా సమస్యను చెప్పుకునే వెసులుబాటు తక్కువేనని తేలింది. ఈ 4 మండలాల్లో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్లు రెండు టీమ్స్‌గా పనిచేస్తున్నారు. ఆర్డీవో స్థాయిలో ప్రత్యేక అధికారి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ప్రతి మండలంలో సగటున రెండున్నర వేల దరఖాస్తులు అందాయి.

ధరణి అమల్లోకి వచ్చిన ఐదేండ్ల తర్వాత కూడా మండలానికి రెండున్నర వేల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతోంది. అనగా రాష్ట్ర వ్యాప్తంగా 605 మండలాలను అంచనా వేస్తే.. మరో 14 లక్షల మంది భూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అధికారుల అంచనా. దీని ప్రకారం 20 నుంచి 25 శాతం మంది రైతులు నేటికీ భూ హక్కుల సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఐతే భూ భారతి కొత్త పోర్టల్ అమల్లోకి రాకముందే రెవెన్యూ డేటాను 100 శాతం ప్యూరిఫై చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందుకే వచ్చే నెల జిల్లాకో మండలంలో పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భూ సమస్యల తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అవే సమస్యలు..

ధరణి పోర్టల్‌లో ఒకసారి భూమి వివరాలు నమోదైతే అత్యంత సురక్షితంగా ఉంటాయని, ట్యాంపరింగ్ చేసే వీల్లేకుండా ఉంటుందంటూ బీఆర్ఎస్ పెద్దలు చెప్పారు. కానీ, ఆ డేటాలోని లోపాలతోనే 30 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. రైతుల భూముల వివరాలు తప్పుగా నమోదు చేసి ఏండ్ల తరబడి తిప్పించుకుంటూనే ఉన్నారు. ఐదేండ్ల నుంచి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నా పరిష్కారం లభించలేదు. ధరణి పోర్టల్ ద్వారా వివిధ మాడ్యూళ్ల కింద అప్లై చేసినా మోక్షం లభించలేదు. లెక్క లేనన్ని సార్లు రిజెక్ట్ చేశారు. కనీసం కారణం కూడా తెలపకుండా ఏకపక్షంగా రిజెక్ట్ చేసిన అప్లికేషన్ల సంఖ్యే ఎక్కువ. సేత్వార్, ఖాస్రా ప్రామాణిక అంటూ నిషేధిత జాబితాలో నమోదు చేయగా హక్కులు కోల్పోయిన రైతుల సంఖ్య లక్షల్లోనే ఉన్నది. ఇప్పుడు 4 మండలాల పైలెట్ ప్రాజెక్టులోనూ అవే సమస్యలు వెల్లడయ్యాయి. ప్రధానంగా సర్వే నంబర్ల మిస్సింగ్, పీవోబీ సమస్య, విస్తీర్ణం తక్కువగా నమోదు కావడం, సాదాబైనామాలు, అసైన్డ్ భూముల విరాసత్, అసైన్డ్ భూములకు పాసు పుస్తకాలు ఇవ్వకపోవడం వంటి సమస్యలే ప్రధానంగా అందాయి. ఇప్పుడీ సమస్యల పరిష్కార మార్గం ఉన్నది. గతంలోనూ అధికారులు తలచుకుంటే చేయదగ్గవే. కానీ, పాత పహానీలను పరిగణనలోకి తీసుకునే వెసులుబాటు కల్పించలేదు. ఇప్పటికైనా సీసీఎల్ఏ స్థాయిలోనే కనీసం 30, 40 ఏండ్ల నుంచి పట్టాగా కొనసాగుతున్న భూములపై నిర్ణయాన్ని ప్రకటించాలని ధరణి బాధితులు కోరుతున్నారు.

పైలెట్ ప్రాజెక్టు తీరిది..

* కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని 17 గ్రామాల్లో 2,261 దరఖాస్తులు అందాయి. దాంట్లో 687 దరఖాస్తులకు నోటీసులు జనరేట్ చేశారు.

* ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో భూ సమస్యల పరిష్కారానికి 3,976 అప్లికేషన్లు అధికారులకు అందాయి. వెంకటాపూర్ మండలంలో మొత్తం 9 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ నెల 17న భూభారతి రెవెన్యూ సదస్సులు ప్రారంభమై 23న పూర్తయ్యాయి.

* నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని 17 గ్రామాల్లో సోమవారం నాటికి 1,341 దరఖాస్తులు అందాయి.

* ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోనూ 2 వేలకు పైగా దరఖాస్తులు అందాయి.


అర్ధవంతమైన దరఖాస్తు ఫారం..

రైతులు తమ సమస్యలను తెలిపేందుకు రూపొందించిన దరఖాస్తు ఫారం అర్ధవంతంగా ఉన్నది. ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నారో సులువుగా అప్లై చేసుకునేలా డిజైన్ చేశారు. కొత్త పాసు పుస్తకం రాలేదు, కొత్త బుక్‌లో తప్పులు ఉన్నాయి, వాస్తవ సాగులో ఉన్న దాని కంటే తక్కువగా నమోదు కావడం, నిషేధిత జాబితాలో నమోదు చేశారు. సాదాబైనామా క్రమబద్ధీకరణ కాలేదు. ఓఆర్సీ రాలేదు, 38–ఇ రాలేదు, అసైన్మెంట్ భూమి సమస్య, సర్వే సబ్ డివిజన్ సమస్య, భూ సేకరణ సమస్యల వంటివి ఏడో కాలమ్‌లో పొందుపరిచేందుకు వీలుగా తయారు చేశారు. ఆ భూమి ఎలా తనకు వచ్చిందో కూడా వివరించేందుకు సులభమైన మెథడ్‌ను అవలంభించారు.

వారసత్వం, భాగ పంపకాలు, సాదాబైనామా కొనుగోలు, రిజిస్టర్ కొనుగోలు, దానం, బహుమతి, ఓఆర్సీ, అసైన్మెంట్, కోర్టు ఉత్తర్వులు, 38 ఇ ద్వారా తనకు వచ్చిందని తెలిపేందుకు కూడా కాలమ్ 6లో ప్రత్యేకంగా రాసేందుకు వీలు కల్పించారు. ఇలా తను ఎదుర్కొంటున్న సమస్యను అధికారులకు విన్నవించేందుకు సులువైన మార్గంగా పైలెట్ ప్రాజెక్టు నడుస్తున్నది. ఇదే అప్లికేషన్ ఆన్‌లైన్‌లో పెట్టుకోవడానికి సవాలక్ష ఫైళ్లు, అనేక ఓటీపీలు, కేవైసీలు, ఫైల్స్ అప్ లోడ్ వంటివి ఉన్నాయి. ఇలాంటి చిక్కుముళ్ల కారణంగానే నేటికీ రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి అప్లై కూడా చేసుకోవడం లేదని పైలెట్ మండలాల్లో తెలుస్తుంది. ఎలాగూ పాత పాసు పుస్తకం ఉంది.. తామే దున్నుకుంటున్నప్పుడు ఇప్పుడేం అవసరం అన్న అభిప్రాయంతో ఉన్న రైతుల సంఖ్యనే అధికం. ఎవరైనా అమ్మేందుకు యత్నించినప్పుడే డేటా సవరణ అత్యవసరమవుతున్నది. అందుకే ఇలాంటి ప్రొఫార్మాల ద్వారానే గ్రామీణ, పేద ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల రైతుల భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయం, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు ఎం.సునీల్ కుమార్​అభిప్రాయపడ్డారు. రెవెన్యూ రికార్డుల డిజిటలీకరణ అనివార్యం.. కానీ, భూ సమస్యల పరిష్కారం, డేటా ప్యూరిఫై చేసేందుకు ఒక్కసారైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మార్గాన్ని అన్వేషించాల్సిందేనన్నారు.

ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు

రెవెన్యూ డేటాను ప్యూరిఫై చేసేందుకు మూడు దశల కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయనున్నది. మొదటి 4 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు, ఆ తర్వాత అంటే మే నెలలో ప్రతి జిల్లాలోని ఓ మండలంలో పైలెట్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇదంతా మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సంకల్పించారు. నేడో రేడో ఏయే జిల్లాలో ఏ మండలంలో పైలెట్ ప్రాజెక్టును చేపట్టనున్నారో స్పష్టత లభించే అవకాశం ఉన్నది. ఈ రెండు పైలెట్ ప్రాజెక్టుల ద్వారా సమస్యలను అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత జూన్ రెండో తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా ప్రతి ఊరిలోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నించే అవకాశం లభిస్తుంది. లేదంటే కనీసం సమస్యల తీవ్రతను గుర్తించే వీలున్నది. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ప్యూరిఫై డేటాతో అనేక విప్లవాత్మక చర్యలకు అడుగులు వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Next Story