- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Govt.: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ ‘రేషన్’ కట్!
అర్హులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం.. అదే సమయంలో అనర్హులను ‘రేషన్’ జాబితా నుంచి తప్పించాలని భావిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: అర్హులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం.. అదే సమయంలో అనర్హులను ‘రేషన్’ జాబితా నుంచి తప్పించాలని భావిస్తున్నది. దీనికి సంబంధించి లిస్ట్ తయారీ ఇప్పటికే పూర్తయినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.30 లక్షల కార్డులను అనర్హులు కలిగి ఉన్నారని గతంలో ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పౌరసరఫరాల శాఖ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. పెద్ద భవంతులు, కార్లు, షాపింగ్ దుకాణాలు, పది ఎకరాలకుపైన భూమి ఉన్న వారికి రేషన్ కార్డులు కట్ చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అంతే కాకుండా గత పదేళ్లుగా కొత్త కార్డుల జారీ, సభ్యుల తొలగింపు వంటి చర్యలు చేపట్టలేదు. కొత్త కార్డులు జారీ చేసే సమయంలో మృతి చెందిన సభ్యుల పేర్లు కూడా రేషన్ కార్డుల్లో నుంచి తొలగించడానికి పౌర సరఫరాల అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే 4.50 లక్షల మందికి సంబంధించి డెత్ సర్టిఫికెట్లు అందినట్లు చెప్పారు. కొత్తగా వచ్చే డిజిటల్ కార్డుల్లో వారి పేర్లు తొలగిస్తామని పేర్కొన్నారు. కాగా, మార్చి ఒకటో తేదీన లక్ష మందికి కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు పూర్తి చేసింది. మరో వారంలో ఎన్నికల కోడ్ ముగుస్తుండడంతో అన్ని జిల్లాల్లో కార్డులు అందజేయనున్నట్లు తెలిసింది.
ఈ మున్సిపాలిటీల్లోనే అనర్హులు అధికం
హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, పీర్జాదిగూడ, బోడుప్పల్, నిజాం పేట పరిధిలో ఎక్కువ శాతం అనర్హుల వద్ద కార్డులు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. వీరంతా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉన్నప్పడు కార్డులు తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు. పాత కార్డుల స్థానంలో ఆహారభద్రత కార్డులను అందజేశారు. అయితే పదేళ్ల క్రితం గ్రేటర్ పరిధిలో ఉన్నవారంతా అప్పడు పేద, మధ్యతరగతి వారిగా ఉండగా.. ఆయా ప్రాంతాలు మున్సిపాలిటీలుగా మారిన అనంతరం ఉన్న కొద్దిపాటి భూములు వెంచర్లుగా చేసి అమ్మకాలు చేయడంతో కోటీశ్వర్లుగా మారారు. కొంతమంది షాపింగ్ క్లాంపెక్సులు నిర్మించుకుని ఖరీదైన కార్లతో తిరుగుతున్నారు. స్థానికంగా రాజకీయం చేస్తూ రేషన్బియ్యం నెలల తరబడి తీసుకోకుండా అమ్ముకోవాలని డీలర్లు చెబుతున్నారు. దీంతో వారిపై ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఫిర్యాదు చేశారు. పేదలు తినాల్సిన బియ్యం బడాబాబులకు ఎందుకని, వారి కార్డులు తొలగించి అర్హులైన పేదలకు ఇవ్వాలని కోరారు.
పథకాలు లబ్ధి కోసం కార్డులకు దరఖాస్తులు
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ప్రజాపాలన, గ్రామసభలు, ప్రజావాణి, మీసేవ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. అయితే చాలా మంది వివిధ పథకాల లబ్ధి కోసం మాత్రమే కొత్త కార్డులకు దరఖాస్తు చేశారనే చర్చ జరుగుతున్నది. ఆరోగ్య శ్రీ, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, కల్యాణలక్ష్మి స్కీమ్స్ కు అర్హత పొందాలంటే రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో పరిస్ధితులను బట్టి స్థానిక రెవెన్యూ, మున్సిపల్అధికారులను మచ్చిక చేసుకొని కార్డులు పొందేందుకు చాలా మంది అనర్హులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
చేర్పులు, మార్పులకు 25 లక్షల దరఖాస్తులు
రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలని, అడ్రస్ లో మార్పులు చేయాలని, అదే విధంగా పేర్లను తొలగించాలని పదేళ్లుగా 25 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెప్పారు. వీటిని స్థానిక మండల అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం ఉంటే వెంటనే ప్రక్రియ పూర్తి చేస్తారు. కార్డులో పేరు చేరిన అదే మాసంలో చౌకధరల దుకాణాల వద్ద సరుకులు తీసుకునే విధంగా అవకాశం కల్పిస్తారు. చేరిన వారి పేర్లు డిజిటల్ కార్డుల్లో నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు.






