- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Govt.: అన్నదాతలకు శుభవార్త.. యాసంగి నుంచి పంట బీమా
యాసంగి సీజన్ నుంచి పంట బీమా పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి సీజన్ నుంచి పంట బీమా పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఉచితంగా బీమా సదుపాయం కల్పించేందుకు వచ్చే నెలలోనే పలు కంపెనీలతో వ్యవసాయ శాఖ సమావేశం కానున్నట్లు తెలిసింది. తరువాత పంటలకు అనుగుణంగా విధివిధానాలు ఖరారు చేయనుంది. రాష్ట్రంలో గ్రామం యూనిట్‌గా, వివిధ రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని పంటల బీమా అమలు చేయనున్నారు. యాసంగి సీజన్‌లో 85 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకృతి విపత్తులతో నష్టం జరిగితే రైతులకు పరిహారం అందేలా ఏర్పాట్టు చేస్తున్నారు. యాసంగిలో నీళ్లు లేక పంటలు ఎండిపోతే.. కోత సమయంలో అకాల వర్షాలతో నష్టం జరిగితే ఈ బీమా ద్వారా ఆదుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఒక సీజన్ ముగిసిపోగా మరో సీజన్ ప్రారంభమైంది. పంట బీమాపై మార్గదర్శకాలు రూపొందించి రైతులకు నష్టం జరగకుండా చూడాలన్న డిమాండ్ వ్యక్తమవుతున్నది.
బీఆర్ఎస్ సర్కార్‌లో బ్రేక్
గత బీఆర్ఎస్ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తరువాత 2018లో పంట బీమా పథకం నిలిపివేసింది. ఈ పథకం బదులు కొత్తగా పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. కానీ.. అమలు చేయడంలో అడుగు ముందుకు వేయలేదు. ఫలితంగా భారీ వానలు, వరదల కారణంగా వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు బీమా సాయం అందలేదు. దీంతో వారు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. దాంతో రాష్ర్టంలో తిరిగి పంటల బీమాను అమలు చేయాలని రేవంత్సర్కార్సంకల్పించింది. అంతేకాకుండా పంటల బీమా కోసం రైతులు చెల్లించే బీమా ప్రీమియం వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడానికి ముందుకు వచ్చింది. దీంతో రైతులకు పైసా ఖర్చు లేకుండానే ఉచితంగా పంటల బీమా అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో అమలు చేసే పంటల బీమా పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతోపాటు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను రాష్ట్ర సర్కారే భరించనుంది.
ఏటా రూ.1,300 కోట్ల ప్రీమియం
వ్యవసాయ శాఖ అంచనాల మేరకు రెండు సీజన్లకు కలిపి రూ.1,300 కోట్లు ప్రీమియం రూపంలో ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసం గత బడ్జెట్‌లో ప్రభుత్వం ఈ మేరకు నిధులు కేటాయించింది. రైతుభరోసా జమ చేశాక వెంటనే ప్రభుత్వం బీమాపై కసరత్తు చేయనుంది. ఇందులో రైతుల వాటా దాదాపు రూ.300 కోట్లు మేర ఉంటుందని అంచనాలు ఉన్నాయి. కాగా.. ఈ ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి రైతులకు ఉచితంగా పంటల బీమా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది.
పరిస్థితులకు అనుగుణంగా పథకం
అకాల వర్షాలతో నష్టం జరిగితే ఒక రకంగా.. కోత కోసి కల్లాల్లో ఉన్నప్పుడు నష్టం జరిగితే మరో రకంగా.. దిగుబడి చాలా స్వల్పంగా వస్తే పరిహారం అందించేందుకు ఇంకో రకంగా ఆయా గ్రామాల పరిస్థితులకు అనుగుణంగా పథకం అమలు చేయాలని వ్యవసాయ శాఖ భావిస్తున్నది. దీంతో ఆయా గ్రామాల్లోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట బీమా పథకం అమలు చేయనున్నారు. పంటల బీమా కోసం నిర్వహించే టెండర్లలో బీమా కంపెనీలు కోట్ చేసే ప్రీమియం ధరలను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి కావడానికి గైడ్‌లైన్స్ రూపకల్పనకు తుదిరూపం ఇచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది.






